True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఉరవకొండ ఎంపీడీవోరవి కుమార్పై క్రమశిక్షణ చర్యలకు డీఆర్ఓ సిఫార్సు!



ఉరవకొండ ఎంపీడీవోపై ఫిర్యాదు.. జెడ్పీ సీఈవోకు డీఆర్ఓ లేఖ

అనధికారిక వేడుకల వ్యవహారంపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశం.. కంప్లయెన్స్ రిపోర్ట్ సమర్పించాలని సూచన

అనంతపురం / ఉరవకొండ, నవంబర్ 21 (ట్రూ టైమ్స్ ఇండియా): ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ పనివేళల్లో అనధికారికంగా వ్యక్తిగత వేడుక నిర్వహించారన్న ఫిర్యాదుపై జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) ఏ. మాలోల స్పందించారు. ఈ వ్యవహారంపై సంబంధిత ఎంపీడీవో రవికుమార్‌పై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (జెడ్పీ సీఈవో)కు లేఖ రాశారు. ఉరవకొండకు చెందిన మీనుగ మధుబాబు సమర్పించిన ఫిర్యాదును తదుపరి చర్యల నిమిత్తం ఫార్వర్డ్ చేశారు.

ఈ మేరకు అనంతపురం కలెక్టరేట్ డీఆర్ఓ కార్యాలయం నుంచి D.Dis.No.H4/4552/2026 నంబరుతో 2026 నవంబర్ 18న అధికారిక లేఖ జారీ అయింది.

షోకాజ్ నోటీసుతో మొదలైన వ్యవహారం

ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ పనివేళల్లో అనధికారికంగా వ్యక్తిగత వేడుక నిర్వహించారంటూ మీనుగ మధుబాబు 2026 అక్టోబర్ 13న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అక్టోబర్ 15న సంబంధిత అధికారులకు చేరింది. దీనిపై స్పందించిన జెడ్పీ సీఈవో ఎంపీడీవోకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

అయితే ఎంపీడీవో సమర్పించిన వివరణలోని అంశాలు, తన వద్ద ఉన్న ఫొటోగ్రాఫిక్ ఆధారాలకు పొంతన లేకుండా ఉన్నాయని మధుబాబు ఆరోపించారు. బాధ్యత నుంచి తప్పించుకునేలా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కనిపిస్తోందని పేర్కొంటూ మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

చర్యల నివేదిక సమర్పించాలని సూచన

ఈ వ్యవహారంపై డీఆర్ఓ ఏ. మాలోల ఫిర్యాదును జెడ్పీ సీఈవోకు పంపుతూ తగిన చర్యలు తీసుకుని కంప్లయెన్స్ రిపోర్ట్ సమర్పించాలని కోరారు. ఈ లేఖ ప్రతిని ఫిర్యాదుదారుడు మీనుగ మధుబాబుకు కూడా పంపించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో విధి నిర్వహణ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగత కార్యక్రమాలు నిర్వహించడంపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎంపీడీవోపై వచ్చిన ఆరోపణలు ఇంకా విచారణకు లోబడి ఉన్నాయి. సంబంధిత అధికారుల విచారణ, తదుపరి నిర్ణయాల అనంతరమే ఈ వ్యవహారంపై స్పష్టత రానుంది.

 
↑