పార్టీ టికెట్ దక్కకపోయినా వెనక్కి తగ్గని వెంకటేషులు!
చేనేత కార్మికులు, చిరు వ్యాపారుల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి..
కాయగూరల మార్కెట్, పార్కు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటే ప్రధాన అజెండా
ఉరవకొండ, నవంబర్ 21 (ట్రూ టైమ్స్ ఇండియా): ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీగా స్థానికంగా 'ఫోటో స్టాట్ వెంకటేషులు'గా గుర్తింపు పొందిన సైదం వెంకటేషులు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. శనివారం ఉరవకొండ తొలి స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తొలుత స్థానిక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అనుచరులు, మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
టికెట్ దక్కకపోవడంతో స్వతంత్రంగా పోటీ
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా, చేనేత వర్గ నాయకుడిగా గుర్తింపు పొందిన సైదం వెంకటేషులు గతంలో ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈసారి సర్పంచ్ టికెట్ ఆశించినప్పటికీ అవకాశం దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ముగ్గురు సంతానం నిబంధన కారణంగా ఎన్నికల్లో పోటీకి దూరమైన ఆయన, ప్రభుత్వం నిబంధనలను సడలించడంతో ఈసారి బరిలోకి దిగారు.
చిరు వ్యాపారులు, కార్మికుల సమస్యలపై పోరాటం
ఉరవకొండలో రహదారుల విస్తరణ సమయంలో ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయిన సందర్భంలో వారికి అండగా నిలిచి పోరాడిన వ్యక్తిగా వెంకటేషులకు స్థానికంగా గుర్తింపు ఉందని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. చేనేత కార్మికులు, మెకానిక్‌లు, భవన నిర్మాణ కార్మికులు, పూలు, పండ్లు విక్రయించే చిరు వ్యాపారులు, మైనార్టీ వర్గాల ప్రజల సమస్యలపై స్పందిస్తుంటారని చెబుతున్నారు. ఈ వర్గాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
25 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కాయగూరల మార్కెట్ ఏర్పాటు లక్ష్యం
నామినేషన్ అనంతరం సైదం వెంకటేషులు మాట్లాడుతూ.. సర్పంచ్ పదవిని అధికారంగా కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావిస్తానని తెలిపారు. ఉరవకొండ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.
పట్టణంలో గత 25 ఏళ్లుగా అందుబాటులో లేని కాయగూరల మార్కెట్ ఏర్పాటు చేయడం, ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు పార్కు నిర్మించడం తన ప్రధాన లక్ష్యాలని వివరించారు. అదేవిధంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణ, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుదల, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు కోరుతున్నా
రాజకీయాలకు అతీతంగా చేనేత కార్మికులు, కూలీలు, చిరు వ్యాపారులు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలు సహా అన్ని వర్గాల ప్రజలు తనకు అండగా నిలిచి ఆశీర్వదించాలని వెంకటేషులు విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి భాగస్వామ్యంతో ఉరవకొండను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామదొడ్డి గోపాల్, నీలూరి తిప్పయ్య, సోమశేఖర్, గన్నే, నరేంద్ర, కండెక్టర్ చంద్రశేఖర్, కోటి నాగభూషణం, పురుషోత్తం, స్టికర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొని వెంకటేషులుకు మద్దతు తెలిపారు.
పార్టీ టికెట్ ఆశించి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సైదం వెంకటేషులు, స్థానిక కార్మికులు, చిరు వ్యాపారుల సమస్యలను తన ప్రచార అజెండాగా ముందుకు తీసుకెళ్తుండటంతో ఉరవకొండ సర్పంచ్ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.

