True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినిపై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి.

  తరగతి గదుల్లోనే విద్యార్థినులకు రక్షణ లేకపోవడం ప్రభుత్వ వైఫల్యం

విద్యార్థినిపై దాడి ఘటనపై AIFDS రాష్ట్ర అధ్యక్షుడు సీఎం సిద్దు ఆగ్రహం

అనంతపురం (ట్రూ టైమ్స్ ఇండియా): పాఠశాలల్లో విద్యార్థినులకు కనీస భద్రత కల్పించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) రాష్ట్ర అధ్యక్షుడు సీఎం సిద్దు విమర్శించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై తరగతి గదిలోకి ప్రవేశించి రంపంతో దాడి చేసినట్లు వచ్చిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పాఠశాలల్లోనే విద్యార్థినుల ప్రాణాలకు రక్షణ లేకపోతే తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ ధైర్యంతో పాఠశాలలకు పంపాలని ప్రశ్నించారు.
ఈ ఘటనపై సీఎం సిద్దు స్పందిస్తూ, పాఠశాలలు విద్యార్థులకు విద్యతో పాటు భద్రత, భరోసా కల్పించాల్సిన ప్రదేశాలని పేర్కొన్నారు. అలాంటి చోట్లే విద్యార్థినులపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. విద్యార్థినుల భద్రత విషయంలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు, పోలీసు యంత్రాంగం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సమీపంలోనే పోలీస్ స్టేషన్, డీఎస్పీ కార్యాలయం ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం భద్రతా ఏర్పాట్లపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు. పాఠశాలల పరిసరాల్లో భద్రతను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. విద్యాసంస్థల్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ విద్యార్థినుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం దారుణమని సీఎం సిద్దు విమర్శించారు. మహిళలు, బాలికలపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు విద్యార్థినులు నిర్భయంగా చదువుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం సిద్దు డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి, బాధ్యులను గుర్తించి చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా పాఠశాలల్లో భద్రతా చర్యలను సమీక్షించి, అవసరమైన చోట్ల అదనపు రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాఠశాలల ప్రవేశ ద్వారాలు, పరిసర ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని, విద్యార్థినుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులు ఎవరైనా ఉంటే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థినుల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని సీఎం సిద్దు హెచ్చరించారు. విద్యార్థినులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రతి పాఠశాలలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

↑