True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

బ్రహ్మసముద్రం పంచాయతీ ఎన్నికలు: నగదు పంపిణీ చర్చలు, కుటుంబాల మధ్య హోరాహోరీ పోరు

               

పల్లెల్లో ఓటుకు గాలం!

నగదు, ప్రలోభాల చుట్టూ ఎన్నికల రాజకీయం

బంధుగణం మధ్య ఆధిపత్య పోరు.. ఒకే పార్టీలోనూ నువ్వా నేనా?

బ్రహ్మసముద్రం మండలంలో ఆసక్తికరంగా మారిన పంచాయతీ ఎన్నికలు

బ్రహ్మసముద్రం, ట్రూ టైమ్స్ ఇండియా, నవంబర్ 24: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. దీంతో పల్లెల్లో ఎన్నికల రాజకీయం తుది అంకానికి చేరుకుంది. గెలుపే లక్ష్యంగా బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు చివరి నిమిషం వరకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు నగదు పంపిణీ, ఇతర ప్రలోభాలపై గ్రామాల్లో చర్చలు జోరందుకున్నాయి. ఓటరు ఎవరికి మద్దతిస్తారు? ఏ అభ్యర్థి విజయతీరాలకు చేరుకుంటారు? అన్న ఉత్కంఠ నెలకొంది.

గ్రామస్థాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్పంచి పదవికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రామాభివృద్ధి, తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ వంటి కీలక బాధ్యతలు సర్పంచి పదవితో ముడిపడి ఉన్నాయి. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా మహాత్మాగాంధీ కన్న కలలను సాకారం చేయాలనే ఆశయంతో పలువురు స్థానిక నాయకులు ఎన్నికల బరిలో నిలిచారు. రాజకీయ అనుభవం, ఆర్థిక బలం, ప్రజాబలం ఉన్న అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం సాగించారు.

ఖర్చు కోట్లకు చేరుతోందా?

గ్రామాల్లో ఎన్నికల ఖర్చుపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. 2,500 నుంచి 6,000 వరకు ఓటర్లు ఉన్న పంచాయతీల్లోనే ఎన్నికల వ్యయం భారీగా ఉంటోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక్కో అభ్యర్థి రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీల్లో పోటీ తీవ్రతను బట్టి ఖర్చులు మరింత పెరుగుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఒక్క ఓటును కూడా వదులుకోకూడదనే ఉద్దేశంతో విదేశాల్లో ఉన్న గ్రామస్తులను స్వగ్రామాలకు రప్పించేందుకు ప్రయాణ ఖర్చులు భరిస్తున్నారనే ప్రచారం సైతం వినిపిస్తోంది. 

అయితే ఈ ప్రచారాలకు అధికారిక ధ్రువీకరణ లేదు.

కుటుంబాల మధ్యే కత్తులు దూస్తున్న రాజకీయాలు

ఈ ఎన్నికల్లో మరో ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులుగా భావించే పార్టీల మధ్యే కాకుండా ఒకే కుటుంబానికి చెందినవారు సైతం పరస్పరం పోటీ పడుతున్నారు. బంధువులే ప్రత్యర్థులుగా మారడం, ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు వేర్వేరు అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్ని చోట్ల ఒకే పార్టీకి చెందిన నాయకులు వేర్వేరు అభ్యర్థుల వెనుక నిలవడంతో స్వపక్షంలోనే విపక్షం అన్న పరిస్థితి నెలకొంది.

బ్రహ్మసముద్రంలో హోరాహోరీ

బ్రహ్మసముద్రం మండలంలోని వేపులపర్తి, నాగిరెడ్డిపల్లి, రాయలడొడ్డి, పాలవెంకటాపురం, ఎరిడికెర, పోలేపల్లి, బొమ్మగానిపల్లి, ముప్పులకుంట గ్రామాల్లో ఎన్నికల పోరు ఉత్కంఠ రేపుతోంది. పలుచోట్ల కుటుంబ సభ్యులు, బంధువులు ప్రత్యర్థులుగా బరిలో నిలవడం విశేషం. స్థానికంగా పట్టున్న నాయకులు, రాజకీయంగా అనుభవం ఉన్నవారు తమ బలాబలాలను అంచనా వేసుకుంటూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు.

ఓటరు తీర్పుపైనే అందరి చూపు

ప్రచారానికి తెరపడటంతో ఇప్పుడు అభ్యర్థుల భవితవ్యం ఓటర్ల చేతుల్లోకి వెళ్లింది. చివరి నిమిషంలో సాగుతున్న రాజకీయ పరిణామాలు, ఓటర్ల మొగ్గు, స్థానిక సమస్యలు, అభ్యర్థులపై ఉన్న విశ్వాసం ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముంది. ప్రలోభాలకు లొంగకుండా గ్రామాభివృద్ధికి ఎవరు కృషి చేస్తారో ఆలోచించి ఓటు వేయాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చివరకు గ్రామ ఓటరు ఎవరికి పట్టం కడతారన్నది వేచి చూడాల్సిందే.    

↑