సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించండి
గ్రామ, మండల అభివృద్ధికి సహకరించండి: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్
కాటూరు, నవంబర్ 4: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఉయ్యూరు మండలంలోని కాటూరు గ్రామంలో బుధవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ అభ్యర్థులను గెలిపించడం ద్వారా గ్రామ, మండల అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న వేమూరి శ్రీనివాస్‌కు తగిన గుర్తింపు కల్పించాల్సిన సమయం వచ్చిందన్నారు. కాటూరు గ్రామ ప్రజలు ఎంపీటీసీ అభ్యర్థిగా వేమూరి శ్రీనివాస్‌ను గెలిపిస్తే, ఆయన ఎంపీపీగా బాధ్యతలు చేపట్టి గ్రామానికి, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అలాగే రెండో ఎంపీటీసీ సెగ్మెంట్ అభ్యర్థి యుగ బాబును, జడ్పీటీసీ అభ్యర్థి కంభం రమేష్‌ను కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీస్సులతో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగు యువత మాజీ అధ్యక్షుడు రామినేని కుటుంబయ్య, టీడీపీ నాయకుడు జంపన వీర శ్రీనివాస్, తెలుగు యువత అధ్యక్షుడు కోడి హరీష్, నేరెళ్ల గుప్త తదితరులు పాల్గొన్నారు.


