ప్రజా తీర్పు కూటమి ప్రభుత్వానికి మద్దతు.. వై.వి.బి. రాజేంద్రప్రసాద్
ఉయ్యూరులో నూతన కౌన్సిలర్లకు ఘన సన్మానం.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపు
ఉయ్యూరు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి దార్శనికత, మంత్రి నారా లోకేష్ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై చూపుతున్న దృష్టి, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు తమ తీర్పు ద్వారా మద్దతు తెలిపారని మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా ఎన్నికైన బూరెల నరేష్, గిరిడి నీలవేణి, బోనంగి సత్యనారాయణ, పల్యాల శ్రీనివాస్ తదితరులు ఆదివారం రాజేంద్రప్రసాద్ స్వగృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. తమ విజయానికి కృషి చేసిన రాజేంద్రప్రసాద్‌తో పాటు మాజీ సర్పంచ్ యలమంచిలి భ్రమరాంబను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం రాజేంద్రప్రసాద్, భ్రమరాంబ దంపతులు నూతన కౌన్సిలర్లను అభినందించి శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మహిళలు, రైతులు, యువత, వృద్ధులు, మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఉయ్యూరు మున్సిపాలిటీ అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర కన్వీనర్ జంపన శ్రీనివాస్, టీడీపీ నాయకులు తాడు గిరిడి వెంకటేష్, మాదినేని జ్యోతి, మాజీ కౌన్సిలర్ బూరెల రమణ, బూరెల రవి, పల్లె లక్ష్మణ, రెడ్డి రమణ, పల్యాల రమేష్, కన్నారావు తదితరులు పాల్గొన్నారు.

