నిన్న బైరెడ్డి.. నేడు జక్కంపూడి రాజా!
రాజానగరంలో జనసేన ఎమ్మెల్యే భార్యకు ఓటమి.. వైసీపీ అభ్యర్థికి జెడ్పీటీసీ విజయం
రాజానగరం: గోదావరి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో వెలువడిన సీతానగరం జెడ్పీటీసీ ఫలితం జనసేనకు గట్టి ఎదురుదెబ్బగా నిలిచింది. జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి ఓటమి పాలవగా, వైసీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరి బాబు 2,607 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఈ విజయంతో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజకీయ కార్యకలాపాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ, క్షేత్రస్థాయిలో పనిచేయడంలో ఆయన చూపుతున్న చొరవను వైసీపీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. రోజుకు 24 గంటలే ఉన్నా, 42 గంటలు పనిచేసే నాయకుడిగా ఆయనను అభిమానులు అభివర్ణిస్తున్నారు.
రాజానగరం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ప్రభావం ఉన్నప్పటికీ, ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లోనూ జక్కంపూడి సోదరులు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. నియోజకవర్గ పరిధిలో సుమారు 30 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుందనే సమాచారం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది.
మొత్తంగా సీతానగరం జెడ్పీటీసీ ఫలితం, ఎంపీటీసీ విజయాలు రాజానగరం రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

