శవాలకు పెన్షన్లు.. నిజలబ్ధిదారులకు తూట్లు!
బోగస్ వికలాంగులు.. నకిలీ చేనేత పింఛన్లతో కోట్ల ప్రజాధనం స్వాహా!*
అధికారులు, జర్నలిస్టుల లోపాయికారీ ఒప్పందాలు.. నోళ్లు మూయించిన నోట్ల కట్టలు!
ఉరవకొండ
సమాజంలో అణగారిన వర్గాలకు, వృద్ధులకు, వికలాంగులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ పింఛన్లు.. అవినీతి తిమింగలాల పాలవుతున్నాయి. అర్హులైన పేదలు ఆకలితో అలమటిస్తుంటే, ఉరవకొండ మండలంలో మాత్రం కాజేసే బ్యాచ్ ‘శవాల’ మీద పేలాలు ఏరుకుంటోంది. చనిపోయిన వారి పేరుతో ఏళ్ల తరబడి పింఛన్ల సొమ్మును దర్జాగా జేబుల్లో వేసుకుంటూ, వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు కొందరు అవినీతి అధికారులు, సిబ్బంది.
మరణించినా.. పింఛన్ మంజూరవుతోంది!
ఉరవకొండ మండలవ్యాప్తంగా దాదాపు *31 మంది* పింఛన్ లబ్ధిదారులు మృతి చెందినప్పటికీ, వారి పేరిట ప్రతి నెలా పింఛన్ సొమ్ము డ్రా అయిపోతోంది. నెలకు రూ. 1,24,000 చొప్పున గడిచిన కొన్నేళ్లుగా లక్షలాది రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టింది.
నింబగల్ మేజర్ పంచాయతీ (3వ సచివాలయం): మూడేళ్ల క్రితమే ముగ్గురు లబ్ధిదారులు మరణించారు. కానీ రికార్డుల్లో మాత్రం వారు బతికే ఉన్నారు! నెలకు రూ. 4,000 చొప్పున, ఈ మూడేళ్లలో ఒక్క ఈ ముగ్గురి పేరిటనే రూ. 1,44,000 స్వాహా చేశారు.
ఉరవకొండ టౌన్ (1వ సచివాలయం): రెండేళ్లుక్రితం చనిపోయిన ఒకే ఒక్క వ్యక్తి పేరు మీద నెలకు రూ. 4,000 చొప్పున ఏకంగా రూ. 96,000* కాజేశారు.
కేవలం ఈ రెండు చోట్లా ‘శవాలు నడిచి’ అందుకున్న పింఛన్ మొత్తమే రూ. 3,40,000 దాటిందంటే, మండలం మొత్తం మీద ఇంకెంత ఘోరం జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
కాపాడిన అధికారి.. కొనేసిన విలేఖరి!
ఈ దారుణమైన కుంభకోణంపై కొందరు సామాజిక కార్యకర్తలు ఒక ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, వ్యవస్థను క్లీన్ చేయాల్సిన ఆ అధికారి.. తన కింది స్థాయి సిబ్బందిని కాపాడటానికి బరితెగించారు. సదరు లబ్ధిదారులు మూడేళ్ల క్రితం చనిపోతే.. తన సీటు కాపాడుకోవడానికి "గత నెలలోనే చనిపోయారు" అని తప్పుడు నివేదికలు సృష్టించినట్లు తెలుస్తోంది.
ఇక సమాజానికి నాలుగో స్తంభంగా నిలవాల్సిన ఒక 'రెండక్షరాల' దినపత్రిక విలేఖరి.. ఈ అవినీతి భాగోతాన్ని వెలుగులోకి తెస్తాడని ఆశిస్తే, సీన్ రివర్స్ అయింది. సదరు విలేఖరి అవినీతి తిమింగలాలతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని, చేతులు తడిపి, నోటికి తాళం వేసుకున్నాడు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్న సామెతను మర్చిపోయి, నోట్ల కట్టలకు అమ్ముడుపోవడం పత్రికా రంగానికే మాయని మచ్చ!
వ్యవస్థ మారాలి.. అవినీతి అంతమవ్వాలి!
అర్హత ఉన్న వికలాంగులు, చేనేత కార్మికులు ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా పింఛన్లు రావడం లేదు. కానీ, నకిలీ సర్టిఫికెట్లతో బోగస్ వికలాంగులు, నకిలీ చేనేత ఐడీలతో కొందరు దర్జాగా పింఛన్లు పొందుతున్నారు. ఇది నిజమైన లబ్ధిదారుల నోటి కాడి కూడును లాక్కోవడమే!
మండల ప్రజల సింహగర్జన:
ఇకనైనా పాలకులు, ఉన్నతాధికారులు నిద్ర మత్తు వీడాలి. ఉరవకొండ మండలంలో జరిగిన ఈ పింఛన్ల కుంభకోణంపై తక్షణమే ఒక *సమగ్ర ఉన్నత స్థాయి విచారణ* జరపాలి. చనిపోయిన వారి పేరుతో, నకిలీ సర్టిఫికెట్లతో ప్రజాధనాన్ని దోచుకున్న ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. స్వాహా చేసిన ప్రతి పైసాను *రెవెన్యూ రికవరీ చట్టం కింద రికవరీ చేయాలి.
అవినీతిని సహించద్దు.. అన్యాయాన్ని ప్రశ్నించడం ఆపొద్దు! నిజాయితీ గల సమాజం కోసం ఉరవకొండ ప్రజలు పోరాటానికి సిద్ధమవుతున్నారు. అవినీతి అధికారులారా.. మీ ఆటలు ఇక సాగవు!


