ఉరవకొండ పట్టణంలో
ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి వారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" ఉరవకొండ మండల కేంద్రంలో నానాటికి పలుచబడుతోంది. 55 వేలకు పైగా జనాభా ఉండి, నిత్యం ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఉరవకొండ పట్టణంలో.. ఈ వేదికకు వస్తున్న అర్జీల సంఖ్య ఘోరంగా పడిపోవడం చర్చనీయాంశంగా మారింది.
సమస్యలు కొండంత.. అర్జీలు గోరంత!
తాజాగా సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి కేవలం ఎనిమిది (8) అర్జీలు మాత్రమే రావడం గమనార్హం. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, తాగునీటి ఎద్దడి, వీధి దీపాల సమస్యలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు వంటి పౌర సమస్యలు వెల్లువలా ఉన్నప్పటికీ, అధికారులు నిర్వహిస్తున్న ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమానికి జనం రావడం తగ్గించేశారు.
నమ్మకం కోల్పోతున్నారా..?
వారాల తరబడి అర్జీలు ఇస్తున్నా స్థానిక అధికారులు వాటిని పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతోంది. కేవలం కాగితాలకే పరిమితమవుతున్న అర్జీల వల్ల ఫలితం లేదనే భావనతోనే జనం ఈ వేదికకు రావడం తగ్గించేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
55 వేల జనాభా ఉన్న పట్టణ కేంద్రంలో కేవలం 8 అర్జీలు రావడం అధికారుల పనితీరుకు, ప్రజా సమస్యల పట్ల వారికున్న ఉదాసీనతకు అద్దం పడుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, వచ్చిన అర్జీలపై తక్షణ చర్యలు తీసుకుని, ఈ వేదికపై ప్రజల్లో మళ్లీ నమ్మకం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
