ఉరవకొండలో సీపీఐ జిల్లాస్థాయి రాజకీయ–సైద్ధాంతిక శిక్షణ శిబిరాలు


 


ఈనెల 23 నుంచి 25 వరకు దేవాంగ కళ్యాణమండపంలో నిర్వహణ –


 250 మంది ప్రతినిధుల హాజరు – జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రత్యేక తరగతులు


 ఉరవకొండ

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో ఈనెల 23, 24, 25 తేదీలలో ఉరవకొండ పట్టణంలోని దేవాంగ కళ్యాణమండపంలో జిల్లాస్థాయి రాజకీయ–సైద్ధాంతిక శిక్షణ శిబిరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి పి. నారాయణస్వామి తెలిపారు. జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కేశవరెడ్డితో కలిసి మంగళవారం శిబిరం ఏర్పాట్లను స్థానిక పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ, ఉరవకొండ ప్రాంతానికి రాజకీయ ఉద్యమాలు, శిక్షణా శిబిరాల నిర్వహణలో ప్రత్యేక చరిత్ర ఉందన్నారు. గతంలో అనేక పోరాటాలకు కేంద్రబిందువుగా నిలిచిన ఈ ప్రాంతంలో మరోసారి జిల్లాస్థాయి రాజకీయ–సైద్ధాంతిక శిక్షణ శిబిరాలను నిర్వహించడం పార్టీకి గర్వకారణమని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయడం, సమకాలీన రాజకీయ పరిణామాలపై నాయకులు, కార్యకర్తలకు స్పష్టమైన అవగాహన కల్పించడం ఈ శిబిరాల ప్రధాన ఉద్దేశమని వివరించారు.

మూడు రోజుల పాటు కొనసాగే ఈ శిబిరాలకు జిల్లా వ్యాప్తంగా సుమారు 250 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు. శిక్షణా తరగతుల్లో జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, దేశ ఆర్థిక విధానాలు, కార్మిక–రైతాంగ సమస్యలు, సామాజిక మార్పులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, పార్టీ నిర్మాణం, ఉద్యమాల నిర్వహణ తదితర కీలక అంశాలపై విస్తృత చర్చలు, బోధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈనెల 23న ప్రారంభమయ్యే శిబిరాలకు పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రెండో రోజు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జీవీ సత్యనారాయణమూర్తి, డి. జగదీష్ పాల్గొని వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారని చెప్పారు. మూడో రోజు రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఈశ్వరయ్య హాజరై రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై మార్గనిర్దేశం చేయనున్నట్లు వివరించారు.

రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు పార్టీ శ్రేణులను సిద్ధాంతపరంగా మరింత బలోపేతం చేయడంలో ఈ శిబిరాలు కీలక పాత్ర పోషిస్తాయని నాయకులు అభిప్రాయపడ్డారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ శిబిరాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు జే. మల్లికార్జున, ఉరవకొండ పార్టీ కార్యదర్శి బి.చెన్న రాయుడు పార్టీ సహాయ కార్యదర్శి నాగేంద్ర, సుల్తాన్, సీనియర్ నాయకులు మల్లేష్, బసవరాజు, కాజా తదితరులు పాల్గొన్నారు.