ఒకే అనుమతి.. రెండు పాఠశాలలు: ఉరవకొండలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమాలపై ఫిర్యాదు

 



నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేటు పాఠశాలలు అక్రమాలకు పాల్పడుతున్నాయని వైయస్సార్ విద్యార్థి విభాగం ఆరోపించింది. ఉరవకొండ నియోజకవర్గంలోని పలు విద్యాసంస్థలు కేవలం ఒకే అనుమతి పత్రంతో రెండు వేర్వేరు పాఠశాలలను నడుపుతూ విద్యాశాఖను పక్కదారి పట్టిస్తున్నాయని ఆ సంఘం నాయకులు సంచలన ఆరోపణలు చేశారు.

ఈ మేరకు సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో జరిగిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో, జిల్లా రెవెన్యూ అధికారి మల్లోలకు విద్యార్థి విభాగం ఉరవకొండ నియోజకవర్గ అధ్యక్షులు సాకే పురుషోత్తం నేతృత్వంలో ఫిర్యాదు అందజేశారు


 అనుమతుల గోల్‌మాల్: ఒకే అనుమతితో రెండు పాఠశాలలు నిర్వహించడం, ఎటువంటి అనుమతులు లేకుండానే అదనపు భవనాల నిర్మాణాలు చేపట్టడంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

 ఫీజుల దోపిడీ: టెక్నో, ఐఐటి, ఒలింపియాడ్ వంటి పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వేలాది రూపాయల ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.

 అధికారుల పాత్ర: కనీస మౌలిక సదుపాయాలు లేకపోయినా, అధికారుల అండతో సదరు పాఠశాలలకు ఏటా రెన్యువల్ పర్మిషన్లు ఇప్పిస్తున్నారని ఆరోపించారు.

ఈ అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులైన పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు సాకే ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.