ఉరవకొండ, 25:
ఉరవకొండ పదో వార్డులో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. నివాస గృహాల మధ్య కుక్క పిల్ల మృతి చెంది పడి ఉన్నా, కనీసం దానిని తొలగించే నాథుడే కరువయ్యారు. ఈ దుర్వాసనతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం:
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన పంచాయతీ కార్యదర్శి తీరుపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శి స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడం పరిపాటిగా మారింది. అనంతపురం నుండి ప్రతిరోజూ ఆలస్యంగా విధులకు హాజరై, సకాలంలోనే తిరుగుముఖం పట్టే ఆయన, ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజాారోగ్యంతో చెలగాటం:
కేవలం పారిశుధ్యం మాత్రమే కాదు, ఉరవకొండలో ప్రజారోగ్యం కూడా ప్రమాదంలో పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఫ్రిజ్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయిస్తున్నా, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ధృవీకరణ లేని మాంస విక్రయాలపై ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం.
ప్రజల డిమాండ్:
మేజర్ గ్రామపంచాయతీ అయినప్పటికీ, ప్రత్యేక పాలనాధికారి సైతం పారిశుధ్య సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వేలాది రూపాయల జీతం తీసుకుంటున్న అధికారులు సకాలంలో సేవలు అందించడంలో విఫలమయ్యారని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. కనీస సదుపాయాలు కల్పించని మరియు అందుబాటులో లేని అధికారులపై ఆర్థిక మంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మంచి ప్రభుత్వం, మంచి పాలన అంటే ఇదేనా?" అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఉరవకొండలో పారిశుధ్య పనులను మెరుగుపరచాలని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
