సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను పరిశీలించిన వైఎస్సార్సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు వై. రాజశేఖర్ రెడ్డి




గుత్తి మండలం బసినేపల్లి గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియను వైఎస్సార్సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు వై. రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు, సిబ్బందితో మాట్లాడి నమోదు, ధృవీకరణ ప్రక్రియ, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు కేవలం రాజ్యాంగం కల్పించిన హక్కు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, అందువల్ల ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో సక్రమంగా ఉండేలా ప్రతి ఒక్కరూ స్వయంగా పరిశీలించుకోవాలని సూచించారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకుడు ఆలస్యం చేయకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అదే విధంగా చిరునామా మారిన వారు, వివాహం తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లిన మహిళలు, ఉద్యోగం, విద్య లేదా ఇతర కారణాలతో ఇతర పట్టణాలు, రాష్ట్రాల్లో నివసిస్తున్న వారు కూడా ఎన్నికల కమిషన్ అందుబాటులో ఉంచిన ఆన్‌లైన్ సేవలను వినియోగించి తమ ఓటు వివరాలను ధృవీకరించుకోవచ్చని తెలిపారు.

ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం, వివరాల్లో తప్పులు ఉండడం లేదా మార్పులు అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించి వెంటనే సరిచేసుకోవాలని సూచించారు. సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం ఎంత ఎక్కువగా ఉంటే, అంత పారదర్శకమైన, విశ్వసనీయమైన ఓటర్ల జాబితా రూపొందుతుందని అన్నారు.

ప్రతి ఓటరు ఎన్నికల కమిషన్ జారీ చేసే మార్గదర్శకాలను పాటిస్తూ, సమయానికి తమ వివరాలను ధృవీకరించుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని కోరారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

మీ ఓటు... మీ హక్కు... మీ భవిష్యత్తు. ఓటు అనేది కేవలం ఒక గుర్తు కాదు, రాష్ట్రం మరియు దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రజాస్వామ్య ఆయుధం. ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకుడు వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఎక్కడ ఉన్నా ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందేలా అందరూ చైతన్యంతో ముందుకు రావాలి." అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రామాంజనేయులు, ఆదినారాయణ, మోహన్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.