ఉరవకొండ,మన జన ప్రగతి జూలై 1౦: విడపనకల్లు మండలంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మద్యం రవాణాకు వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేశారు.
అనంతపురం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి బి. రామ్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఉరవకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఆర్. రవిచంద్ర, ప్రత్యేక అమలు బృందం సిబ్బందితో కలిసి శుక్రవారం తెల్లవారుజామున విడపనకల్లు గ్రామ శివారులోని విడపనకల్లు–కరకముక్కల బస్సు మార్గంలో వాహన తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా ఒక ద్విచక్ర వాహనంపై సంచుల్లో మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సంచులను పరిశీలించగా, కర్ణాటక రాష్ట్రానికి చెందిన హేవార్డ్స్ చీర్స్ విస్కీ బ్రాండ్‌కు చెందిన తొంభై మిల్లీలీటర్ల సామర్థ్యం గల మొత్తం ౬౭౨ టెట్రా ప్యాకెట్లు, ఏడు కార్టన్ పెట్టెల్లో లభించాయి.
అక్రమ రవాణాకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన నిందితులు విడపనకల్లుకు చెందిన టి. ఆనంద్, టి. వీరేష్, టి. రాజేష్‌లుగా గుర్తించారు. వీరిపై ఉరవకొండ ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఈ దాడుల్లో అనంతపురం ప్రత్యేక అమలు బృందం ఇన్‌స్పెక్టర్ జయనాథ్ రెడ్డి, ఉరవకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
