9వ పీఠాధిపతి జగద్గురు శ్రీ చెన్న బసవ రాజేంద్ర స్వామి శివైక్యం

 770 మఠాలకు మూలపీఠం గవిమఠం.. తదుపరి జగద్గురు ఎవరనే ఉత్కంఠ!


ఏజెంట్ రాజన్న మృతి తర్వాత మరో భారీ లోటు.. కళ్యాణ స్వామీజీనా? ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్ర స్వామినా? భక్తుల్లో చర్చ

ఉరవకొండ/బళ్లారి:

ఆంధ్రప్రదేశ్–కర్ణాటక రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక, సామాజిక, విద్యా సేవలకు చిరునామాగా నిలిచిన ఉరవకొండ శ్రీ గవిమఠ సంస్థానం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 770 అనుబంధ మఠాలకు మూలపీఠంగా పేరొందిన ఈ మహాసంస్థకు చెందిన 9వ పీఠాధిపతి జగద్గురు శ్రీ చెన్న బసవ రాజేంద్ర స్వామి (98) శనివారం బళ్లారిలో శివైక్యం చెందారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.


జగద్గురువు శివైక్యంతో వేలాది మంది భక్తులు, శిష్యులు, మఠాధిపతులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక రంగంలోనే కాకుండా సామాజిక సేవల్లోనూ విశిష్ట ముద్ర వేసిన మహనీయుడి మరణం గవిమఠ చరిత్రలో ఒక యుగానికి ముగింపు పలికినట్లుగా భావిస్తున్నారు.


ఇటీవలే ఏజెంట్ రాజన్న మృతి.. ఇప్పుడు జగద్గురు శివైక్యం


కొద్ది రోజుల క్రితమే మఠ పరిపాలనలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఏజెంట్ రాజన్న గౌడ్ మరణించారు. ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే జగద్గురువు శివైక్యం చెందడం గవిమఠానికి వరుస దెబ్బగా మారింది. పరిపాలన, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం రెండింటిలోనూ ఏర్పడిన శూన్యతను ఎలా భర్తీ చేస్తారన్న అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.


తదుపరి జగద్గురు ఎవరు?


జగద్గురువు అనంతరం పీఠాధిపతి పదవిని ఎవరు అధిష్ఠిస్తారన్న అంశంపై భక్తులు, మఠ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.


ప్రస్తుతం మఠ పరిపాలన బాధ్యతలను నిర్వహిస్తున్న కళ్యాణ స్వామీజీకి జగద్గురువుకు అత్యంత సన్నిహితుడిగా, ఆయన విశ్వాసాన్ని పొందిన వ్యక్తిగా పేరు ఉంది. పరిపాలనా అనుభవం ఉండటంతో ఆయనే పీఠాన్ని అధిష్ఠరించే అవకాశాలు ఉన్నాయని కొందరు భావిస్తున్నారు.


మరోవైపు, ఉరవకొండ ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్ర స్వామి కూడా బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ పూర్తి చేసిన ఆయన, వ్యక్తిగత జీవితాన్ని పక్కనబెట్టి మఠ సేవ కోసం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఆధ్యాత్మిక, విద్యా, పరిపాలనా అర్హతలు కలిగిన ఆయనకు కూడా పీఠాధిపతి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు.


నలుగురు ఏజెంట్ల మధ్య పోటీ?


మఠ పరిపాలనలో కీలకమైన ఏజెంట్ పదవి కోసం ఇప్పటికే నలుగురు పోటీలో ఉన్నట్లు సమాచారం. ఈ నియామకాలు పూర్తయిన తర్వాతే పీఠాధిపతి ఎంపిక ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని మఠ వర్గాలు చెబుతున్నాయి.


770 మఠాలు.. కోట్లాది రూపాయల ఆస్తుల బాధ్యత


గవిమఠ సంస్థానం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల్లో విస్తరించిన 770 అనుబంధ మఠాలు ఉన్నాయి. వీటికి చెందిన స్థిర, చరాస్తులు, వ్యవసాయ భూములు, దేవాదాయ ఆస్తులు, బ్యాంకు డిపాజిట్లు, ధార్మిక సంస్థల నిర్వహణ వంటి విస్తృత బాధ్యతలు పీఠాధిపతిపై ఉంటాయి. అందువల్ల తదుపరి జగద్గురు ఎంపిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.


ఆధ్యాత్మిక వారసత్వాన్ని ముందుకు నడిపేది ఎవరు?


వాక్చాతుర్యం, ధార్మిక బోధనలు, సామాజిక చైతన్యం, రాజకీయ వర్గాలతో సత్సంబంధాలు కలిగిన జగద్గురు చెన్న బసవ రాజేంద్ర స్వామి మరణంతో ఏర్పడిన లోటును భర్తీ చేయడం అంత సులభం కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు గవిమఠం ఆధ్యాత్మిక వారసత్వాన్ని, పరిపాలనా బాధ్యతలను సమర్థంగా ముందుకు నడిపించే నాయకత్వం ఎవరిదనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభించనుంది.

770 మఠాలకు మూలపీఠమైన గవిమఠ భవిష్యత్తును నిర్ణయించే ఈ వారసత్వ ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.