ఉరవకొండజులై 16
సాంకేతిక కారణాలతో వాయిదా.. అక్రమ రిజిస్ట్రేషన్లు, లోకాయుక్త కేసు, చట్టపరమైన చర్యలతో మళ్లీ తెరపైకి వివాదం
ఉరవకొండ శ్రీ గవిమఠం సంస్థానానికి చెందిన వివాదాస్పద దేవాదాయ భూముల బహిరంగ వేలం గురువారం చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీ ప్రకటించి వేలం నిర్వహిస్తామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
కర్ణాటక సరిహద్దులోని చెల్లగురికి పరిసర ప్రాంతాల్లో ఉన్న జగద్గురు కరిబస స్వామి మఠానికి చెందిన ఈ భూములు చాలా కాలంగా వివాదంలో ఉన్నాయి. గతంలో గుంతకల్లు దేవాదాయ శాఖ ఈఓగా పనిచేసిన అధికారి రికార్డులు తారుమారు చేసి తన పేరు, కుటుంబ సభ్యుల పేర్లపై అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారనే ఆరోపణలు రావడంతోమధుబాబు లోకాయుక్త లో కేసు వేశారు.ఆయనను సస్పెండ్ చేశారు. అనంతరం జరిగిన శాఖాపరమైన విచారణలో భూములను తిరిగి మఠానికి అప్పగిస్తానంటూ హామీ పత్రం ఇచ్చిన తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం జిల్లాకు వెలుపల బదిలీ చేసి, కర్నూలు జిల్లాలో గ్రూప్ టెంపుల్ అధికారిగా నియమించారు.
తర్వాత మళ్లీ గుంతకల్లు గ్రూప్ టెంపుల్ అధికారిగా బదిలీపై వచ్చినప్పటికీ, వివాదాస్పద భూములు తిరిగి మఠం ఆధీనంలోకి రాలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై లోకాయుక్తను ఆశ్రయించగా, ఈఓతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఆ మేరకు హాగరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని, అరెస్టు నుంచి రక్షణ కోసం సంబంధిత వ్యక్తులు ముందస్తు బెయిల్ పొందినట్లు సమాచారం.
ఇదే భూములకు సంబంధించి బళ్లారి కోర్టులో గతంలో ఇంజంక్షన్ ఉత్తర్వులు పొందగా, అనంతరం ఆ ఉత్తర్వులను గవిమఠం అధికారులు తొలగించించడంతో భూముల వేలానికి మార్గం సుగమమైంది. అన్ని ఏర్పాట్లు పూర్తయి గురువారం వేలం నిర్వహించాల్సి ఉండగా, తుది దశలో సాంకేతిక కారణాలతో ప్రక్రియ నిలిచిపోయింది.
దేవాదాయ భూములకు ‘30/87’ చట్టం కఠిన రక్షణ
దేవాలయాలు, మఠాలు, ధర్మ సంస్థల ఆస్తుల రక్షణ కోసం అమల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, ధర్మాదాయ సంస్థల చట్టం–1987 (యాక్ట్ 30/1987) ప్రకారం దేవాదాయ భూములను ఆక్రమించడం, అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్లు చేయించడం, విక్రయాలు లేదా ఇతర లావాదేవీలు నిర్వహించడం చట్టరీత్యా చెల్లవు.
ఈ చట్టంలోని సెక్షన్–80 ప్రకారం ఎండోమెంట్స్ కమిషనర్ అనుమతి లేకుండా జరిగిన ఎలాంటి అమ్మకాలు, బహుమతులు, లీజులు, తాకట్టు లావాదేవీలు చట్టపరంగా శూన్యమైనవే .
అదేవిధంగా సెక్షన్ 83, 84 ప్రకారం ఆక్రమణదారులను గుర్తించి ట్రిబ్యునల్ ద్వారా నోటీసులు జారీ చేసి విచారణ అనంతరం అవసరమైతే పోలీసుల సహకారంతో ఆక్రమణలను తొలగించే అధికారం దేవాదాయ శాఖకు ఉంది.
ఆక్రమిస్తే క్రిమినల్ చర్యలు
దేవాదాయ ఆస్తులపై అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలు లేదా అనధికార లావాదేవీలకు పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, నేరం రుజువైతే జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఉరవకొండ శ్రీ గవిమఠం సంస్థానానికి చెందిన భూముల వద్ద ఇప్పటికే దేవాదాయ శాఖ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, దేవాదాయ చట్టం 30/1987 ప్రకారం ఆస్తులను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వాయిదా పడిన భూముల వేలం ఎప్పుడు నిర్వహిస్తారన్నది ఇప్పుడు స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
