ఏ జర్నలిస్టు కుటుంబాన్ని ఒంటరిగా వదిలిపెట్టం – ఏపీడబ్ల్యూజేఎఫ్


 

జర్నలిస్టు నాగరాజు కుటుంబానికి ఉరవకొండలో అండగా నిలిచిన ఏపీడబ్ల్యూజేఎఫ్

ఉరవకొండ, జూలై 8:

జర్నలిస్టు కుటుంబాలు కష్టకాలంలో ఒంటరిగా మిగిలిపోకుండా అండగా నిలవడం తమ బాధ్యత అని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజినేయులు అన్నారు.

గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెచ్ఎం టీవీ ఉరవకొండ రిపోర్టర్ నాగరాజు కుటుంబాన్ని మంగళవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా నాగరాజు భార్య, కుమారుడిని ఓదార్చి, సంస్థ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఏపీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తికి స్పందించిన బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి, నాగరాజు కుమారుడి ఏడాది విద్యకు అవసరమైన ప్రైవేట్ పాఠశాల ఫీజును అందజేయడానికి ముందుకు వచ్చారు. పల్లె కుటుంబం తరఫున ఆ మొత్తాన్ని రేపటి రామాంజినేయులు విద్యార్థి తల్లికి అందజేశారు.

ఈ సందర్భంగా రామాంజినేయులు మాట్లాడుతూ, "ఇది కేవలం ఫీజు చెల్లించడం మాత్రమే కాదు, ఒక జర్నలిస్టు బిడ్డ భవిష్యత్తుపై నమ్మకాన్ని కల్పించే చేయూత. ఏ జర్నలిస్టు కుటుంబాన్ని కూడా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఒంటరిగా వదిలిపెట్టదు. కష్టకాలంలో తోడుగా నిలవడమే మా లక్ష్యం" అని తెలిపారు.

ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు సమాజం, మానవతావాదులు అందించే చేయూత ఎంతో విలువైనదని ఆయన పేర్కొన్నారు. ఆ చిన్నారి కళ్లలో కన్నీళ్లకు బదులుగా చదువుపై ఆశలు, ఆత్మవిశ్వాసం మెరవాలని ఆకాంక్షించారు.

జర్నలిస్టు కోసం జర్నలిస్టులు, సమాజం కోసం మానవతావాదులు కలిసి నిలబడితే బాధిత కుటుంబాలకు కొత్త ఆశలు చిగురిస్తాయని, ఈ సంఘటన అందుకు నిదర్శనమని రేపటి రామాంజినేయులు పేర్కొన్నారు.