హంద్రీ-నీవా రెండో దశ కాలువ యాత్రకు వైసీపీ పిలుపు



 


అనంతపురం  జూలై 16: 

హంద్రీ-నీవా రెండో దశ కాలువ యాత్రను ఈ నెల 19న నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ రాయలసీమ ప్రాజెక్టుల టాస్క్ ఫోర్స్ ప్రకటించింది. ఈ యాత్రను ప్రజలు, రైతులు, మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

అనంతపురంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, రాయలసీమ ప్రాజెక్టుల టాస్క్ ఫోర్స్ రాష్ట్ర కోఆర్డినేటర్, రాయలసీమ జోనల్ అధికార ప్రతినిధి కె.వి. రమణ మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో హంద్రీ-నీవా తొలి దశ వెడల్పు పనులు, రెండో దశ లైనింగ్ పనుల కోసం సుమారు రూ.3,850 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయని వారు పేర్కొన్నారు. అయితే ఆ వ్యయానికి తగిన స్థాయిలో రైతులకు, ప్రజలకు ప్రయోజనం కలిగిందా? పనుల నాణ్యత ఎలా ఉంది? అనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

యాత్రలో రాష్ట్ర టాస్క్ ఫోర్స్ నాయకులు, సాంకేతిక నిపుణులు, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, జిల్లా పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. హంద్రీ-నీవా రెండో దశ పరిధిలోని గ్రామాల రైతులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు.

హంద్రీ-నీవా ప్రాజెక్టు లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయి, గత 40 ఏళ్లలో వివిధ ప్రభుత్వాలు చేపట్టిన పనుల ఫలితాలు ఏమిటి, ప్రాజెక్టుల ద్వారా ఆశించిన ప్రయోజనాలు ప్రజలకు అందాయా లేదా అనే అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. లోపాలు గుర్తిస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా ఒత్తిడి తీసుకురావడమే టాస్క్ ఫోర్స్ లక్ష్యమని పేర్కొన్నారు.

రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులను కూడా పరిశీలించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇటీవల నెల్లూరులో జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో అన్ని ప్రాజెక్టులను సందర్శించి వాస్తవ పరిస్థితులపై నివేదిక రూపొందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.