ఉరవకొండ డ్రైవర్స్ కాలనీలో భక్తిశ్రద్ధల నడుమ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక అలంకరణ

 





ఉరవకొండ,  జులై 18::

ఉరవకొండ పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం పంచమి తిథి సందర్భంగా విశేష పూజలు, ప్రత్యేక అలంకరణలు అత్యంత వైభవంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని సువర్ణాభరణాలు, పుష్పమాలలు, తులసీమాలలతో అద్భుతంగా అలంకరించగా, స్వామివారి దివ్య మంగళ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయంలో వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, హారతులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.


అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు. పంచముఖ ఆంజనేయస్వామివారి సుందర రూపాన్ని దర్శించిన భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందుతూ కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ప్రార్థనలు చేశారు.

పంచమి శనివారం సందర్భంగా ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు,ఎయిర్ టెల్ ప్రతాప్,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమం ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.

"గోవిందా... గోవిందా...", "జై శ్రీరామ్... జై హనుమాన్..." నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగి భక్తిమయ వాతావరణం నెలకొంది.