ఉరవకొండ జులై 19:
శ్రీ గవిమఠ సంస్థానం 8వ పీఠాధిపతి, పరమపూజ్య జగద్గురు చెన్నబసవ రాజేంద్ర స్వామి బ్రహ్మలీనమైన సందర్భంగా ఆదివారం ఉరవకొండలో భక్తిశ్రద్ధలతో అంతిమ నివాళులు అర్పించారు. 98 ఏళ్ల వయస్సులో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామివారు పరమపదించారు.
స్వామివారి పార్థివదేహాన్ని బళ్లారి నుంచి ఉరవకొండ శ్రీ గవిమఠ సంస్థానానికి తీసుకువచ్చి, వేలాది మంది భక్తులు, శిష్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖుల చివరి దర్శనార్థం ఉంచారు. భక్తులు కన్నీరుమున్నీరుగా నివాళులర్పిస్తూ, పూలమాలలు సమర్పించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.
వీరశైవ ఆగమ సంప్రదాయాలు, మఠ పరంపర నియమాల ప్రకారం పలువురు మఠాధిపతుల ఆధ్వర్యంలో స్వామివారికి అంత్యక్రియలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదఘోషలు, శివనామస్మరణలు, భక్తుల ప్రార్థనల నడుమ జగద్గురువారిని బృందావన (సమాధి)లో ప్రతిష్ఠించారు.
తన ఆధ్యాత్మిక బోధనలు, ధర్మ పరిరక్షణ, సమాజ సేవ ద్వారా అనేక మంది భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన జగద్గురు చెన్నబసవ రాజేంద్ర స్వామి స్మృతి చిరంజీవిగా నిలిచిపోతుందని భక్తులు భావోద్వేగంతో నివాళులర్పించారు.



