జర్నలిస్టుల సంక్షేమం ఎక్కడ ?

 


- ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజనేయులు 


ఉరవకొండ, జూలై 7: 


 జర్నలిస్టుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై మీడియా వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ ) అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజనేయులు ధ్వజమెత్తారు. మంగళవారం నాడు ఉరవకొండ పట్టణంలోని లయన్స్ క్లబ్ సమావేశ మందిరంలో ఉరవకొండ నియోజకవర్గం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రేపటి రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా గౌరవ వేతనం, ఇంటి స్థలాలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై మంచి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతూ వస్తున్నారన్నారు. అయితే ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో స్పష్టమైన నిర్ణయాలు వెలువడలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను, చేస్తున్న డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

జర్నలిస్టుల ఆరోగ్య భద్రత, గృహ అవసరాలు, సామాజిక భద్రతకు సంబంధించిన హామీలు గతంలో వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు ఇచ్చినా అమలుకు నోచుకోలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, ఎన్నికల నిబంధనలు అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తుండడం దారుణమన్నారు. ఇలాంటి పరిణామాలు మీడియా స్వేచ్ఛపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సీనియర్ నాయకులు, 6 టీవీ బ్యూరో ఇంచార్జి డాక్టర్ సూర్య, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పులివారి హరిప్రసాద్, ఉరవకొండ నియోజకవర్గం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఆర్. భీమప్ప, పీవై సుంకన్న ఏళ్ళ సాయి, జమీల్. ఏం రామాంజినేయులు (జెమిని ) సుధాకర్, టీవీ 5 ఎర్రి స్వామి, మధు బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది.