కోదాడలో కాకతీయ సేవా సమితి నూతన కళ్యాణ మండపం ప్రారంభం

 














దాతల సేవా స్ఫూర్తికి ప్రశంసలు – పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ


కోదాడ, జూన్ 25: ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ బైపాస్ రోడ్డులో కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన నూతన కళ్యాణ మండపాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రముఖ దాత వీరేపల్లి లక్ష్మీనారాయణతో కలిసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం సమితి అధ్యక్షుడు పెదనాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.


తెలంగాణ కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ మాట్లాడుతూ, వ్యవసాయం, వ్యాపారం, పరిశ్రమలు, విద్య తదితర రంగాల్లో కృషి చేసి దేశాభివృద్ధికి విశేష సేవలందించిన మహనీయులను స్మరించారు. సమాజ సేవలో ముందుండే దాతలను అభినందిస్తూ, కోదాడలో నిర్మించిన కళ్యాణ మండపం ప్రజలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. మండప నిర్మాణానికి సహకరించిన దాతలు, కమిటీ సభ్యుల సేవలను కొనియాడారు.


ఏపీ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు మాట్లాడుతూ, సమాజాభివృద్ధికి విశేష సేవలందించిన మహనీయులను గుర్తు చేశారు. నాగార్జునసాగర్ నిర్మాణానికి భూములు దానం చేసిన ముక్త్యాల రాజా రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ వంటి దాతల సేవలను ప్రస్తావించారు. కళ్యాణ మండప నిర్మాణానికి కోట్ల రూపాయల విరాళాలు అందించిన మాజీ మంత్రి వీరేపల్లి లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు, విశ్రాంత అధ్యాపకులు రావిళ్ల సీతారామయ్యలను ప్రత్యేకంగా అభినందించారు.


తెలంగాణ కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్ రావు మాట్లాడుతూ, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సంఘాలు మరింత చేయూత అందించాలని పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాల ద్వారా సామాజిక బాధ్యతను చాటాలని సూచించారు.


సభాధ్యక్షుడు, కాకతీయ సేవా సమితి అధ్యక్షుడు పెదనాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, 2018లో ప్రారంభమైన సమితి 2019లో 2.75 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి, 2021లో కళ్యాణ మండప నిర్మాణాన్ని ప్రారంభించిందన్నారు. ఇప్పటివరకు సుమారు రూ.14 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తైందని, ప్రస్తుత మార్కెట్ విలువ రూ.25 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ఈ మండపం ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి వినియోగిస్తామని వెల్లడించారు.


ఈ సందర్భంగా రూ.3.60 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌లను 25 మంది పేద విద్యార్థులకు పంపిణీ చేశారు. నిర్మాణానికి సహకరించిన దాతలను ఘనంగా సన్మానించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, ఎమ్మెల్సీ తాతా మధు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కోదాడ మున్సిపల్ చైర్మన్ కుసుమ వెంకటరత్నం, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ సంఘాల ప్రతినిధులు, దాతలు, సామాజిక ప్రముఖులు, తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కార్యక్రమం అనంతరం హాజరైన అతిథులకు ఘన విందు ఏర్పాటు చేయగా, స్థానిక కాకతీయ సేవా సమితి సభ్యులు అన్ని ఏర్పాట్లను విజయవంతంగా నిర్వహించారు.