కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి – ఏఐటీయూసీ డిమాండ్
ఉరవకొండ,
రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడంతో పాటు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం
ఉరవకొండ నియోజకవర్గ ఏఐటీయూసీ ముఖ్య నాయకుల సమావేశం స్థానిక సీపీఐ కార్యాలయంలో చెన్నరాయుడు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో రాజేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటో కార్మికులు, హమాలీలు, వీధి వ్యాపారులు తదితర అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, వారికి సామాజిక భద్రత కల్పించే సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడం విచారకరమన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కార్మికుల జీవన వ్యయం కూడా అధికమవుతోందని, పార్లమెంటరీ కమిటీలు సూచించిన విధంగా కనీస వేతనాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలకు కనీసం రూ.26 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ శాఖలో స్మార్ట్ మీటర్ల అమలుతో మీటర్ రీడర్ల ఉపాధికి ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, వారికి విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం విజయవాడలో నాలుగు రోజులపాటు నిర్వహించిన నిరసనల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని, వెంటనే చర్యలు తీసుకోకపోతే మలిదశ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మహేష్, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి రమేష్, ఏఐటీయూసీ ఉరవకొండ కన్వీనర్ మోహన్, కో-కన్వీనర్లు కేశవరాజు, ఖాజా, నాయకులు చక్రధర్, హరీష్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.