ఉరవకొండ, జూలై 8:
భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శిగా ఉరవకొండకు చెందిన వాల్మీకి సురేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వం నియామక పత్రాన్ని అందజేసింది.
విద్యా రంగంలో గుర్తింపు పొందిన సురేంద్ర, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ ప్రాథమిక స్థాయి నుంచి ఎదుగుతూ జిల్లా స్థాయి బాధ్యతలను చేపట్టే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.
భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కోనకొండ్ల రాజేష్ జిల్లా అధికార ప్రతినిధుల నియామకాలను ప్రకటించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, జిల్లా స్థాయిలో పార్టీ కార్యక్రమాల సమన్వయాన్ని సమర్థవంతంగా నిర్వహించడమే ఈ నియామకాల లక్ష్యమని పేర్కొన్నారు. నియమితులైన నాయకులు పార్టీ సిద్ధాంతాలు, రాజ్యాంగం, సంస్థాగత మార్గదర్శకాలకు అనుగుణంగా అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
జిల్లా కార్యదర్శిగా వాల్మీకి సురేంద్ర నియామకం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉరవకొండకు చెందిన దగ్గుపాటి సౌభాగ్య శ్రీరామ్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా కొనసాగుతుండగా, మరో కీలక జిల్లా పదవి ఉరవకొండకు దక్కడంతో స్థానిక బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా వాల్మీకి సురేంద్ర మాట్లాడుతూ, తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

