పెన్నహోబిలం ఉద్భవ లక్ష్మీదేవి ఆలయంలో చోరీ


 

హుండీ నగదు అపహరణ.. సీసీ కెమెరాలు, డీవీఆర్ ధ్వంసం చేసి తీసుకెళ్లిన దుండగులు

ఉరవకొండ, జూలై 8: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి చెందిన ఉప ఆలయం శ్రీ ఉద్భవ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి దొంగతనం చోటుచేసుకుంది.

మంగళవారం తెల్లవారుజామున ఆలయ అర్చకుడు మయూరం బాలాజీ నిత్యపూజల కోసం ఆలయానికి చేరుకోగా, ప్రధాన ద్వారానికి ఉన్న బీగం పగులగొట్టబడినట్లు గుర్తించారు. అనంతరం ఆలయంలో పరిశీలించగా, గుర్తుతెలియని దుండగులు హుండీ తాళం పగులగొట్టి అందులో ఉన్న నగదును అపహరించినట్లు తెలిసింది. అలాగే ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, డీవీఆర్‌ను ధ్వంసం చేసి తీసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.

దేవస్థానానికి చెందిన విలువైన ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ముందస్తుగా బ్యాంకు లాకర్లలో భద్రపరిచినందున వాటికి ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇటీవలే హుండీ లెక్కింపు నిర్వహించినందున, అందులో సుమారు రూ.500 నుంచి రూ.600 వరకు మాత్రమే నగదు ఉండవచ్చని అంచనా వేశారు. ఆలయంలో ఉన్న బంగారు తాళిబొట్టును కూడా దుండగులు తీసుకెళ్లలేదని పేర్కొన్నారు.

ఈ ఘటనపై దేవస్థానం కార్యనిర్వాహణాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు నిర్వహించారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి వేలిముద్రలు లేదా ఇతర ఆనవాళ్లు లభించలేదని తెలిపారు.

దేవస్థానం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో దాని ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాన్ని దేవస్థానం అధికారులు వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.