స్పోర్ట్స్ డెస్క్:క్రికెట్ ఆస్ట్రేలియా ఇచ్చిన అనుమతితో ఆ దేశ మహిళల బిగ్‌బాష్ లీగ్ (WBBL) లో ఆడేందుకు సన్నద్ధమవుతున్న ట్రాన్స్‌జెండర్ క్రికెటర్ అనయ బంగర్, తనపై వస్తున్న విమర్శలకు దీటుగా బదులిచ్చారు. ఆమెకు ఎలా అనుమతి ఇస్తారంటూ అంతర్జాతీయ క్రీడాకారిణి, దక్షిణాఫ్రికా క్రికెటర్ మరిజన్నె కాప్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అనయ తీవ్రంగా స్పందించారు.
"నేనిక్కడ ఏదో అన్యాయంగా ప్రయోజనం పొందేందుకు రాలేదు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిర్దేశించిన మార్గదర్శకాలను పక్కాగా పాటించడం ద్వారానే నాకు అనుమతి లభించింది. దీనిపై గళమెత్తాలనుకొనే వారు ముందుగా సరైన అవగాహన పెంచుకొని మాట్లాడితే బాగుంటుంది" అని అనయ ఘాటుగా బదులిచ్చారు. త్వరలోనే ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి క్లబ్ క్రికెట్‌లో తన సత్తా నిరూపించుకుంటానని, ఇప్పుడు వేసేవి చిన్న అడుగులే అయినా ఆడేందుకు ఓ వేదిక ఉండాలనే తన కోరిక తీరిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
బీసీసీఐ మౌనం.. మనసును గాయపరిచింది ఇదే సమయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరుపై అనయ బంగర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లకు సంబంధించి పాలసీని రూపొందించాలని తాను చేసిన విజ్ఞప్తికి బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదని, కేవలం మౌనమే ఎదురైందని ఆమె వాపోయారు.
"బీసీసీఐ తీరు నన్ను అత్యంత నిరుత్సాహపరిచింది, నా మనసు కకావికలమైంది. మన దేశంలో లింగమార్పిడి ప్రక్రియ నన్ను క్రికెట్‌కు దూరం చేస్తుందని నాకు ముందే తెలుసు. మన దగ్గర ఈ తరహా కేసు ఇదే మొదటిది. ఇప్పుడైనా బీసీసీఐ దీన్ని సానుకూలంగా స్వీకరించి, ట్రాన్స్‌జెండర్ క్రీడాకారుల కోసం సరైన విధివిధానాలను రూపొందించేందుకు ప్రయత్నిస్తుందని ఆశిస్తున్నా" అని అనయ పేర్కొన్నారు. స్వదేశంలో అవకాశం లేకపోవడం వల్లే తాను ఆస్ట్రేలియా బోర్డు తలుపులు తట్టాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.
