రక్షా బంధన్‌ ప్రత్యేక కథనం: మనం మిస్‌ అయిన తెలుగు రాజకీయ తోబుట్టువులు.. ఒకప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

 హైదరాబాద్/అమరావతి:రక్షా బంధన్‌ అనగానే మనకు గుర్తొచ్చేది అన్నాచెల్లెళ్ల అప్యాయతలు, అనురాగాలు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండుగ రాజకీయాల్లోనూ ఒకప్పుడు ప్రత్యేకంగా నిలిచేది.

​ఒకప్పుడు రాఖీ పండుగ వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతీయ పార్టీలైన బీఆర్‌ఎస్‌ (BRS), వైసీపీ (YCP) సొంత పత్రికలు, మీడియా ఛానెళ్లు పేజీలకు పేజీలు కలర్‌ఫుల్‌ ఫొటోలతో నిండిపోయేవి! “అన్న వెంటే చెల్లెలు.. చెల్లెలికి తోడుగా అన్న” అంటూ అన్నాచెల్లెళ్ల రాజకీయ అనుబంధంపై కవితలు, వ్యాసాలు రాసిపడేసేవారు. పార్టీ అధినేతలు సైతం తమ కుటుంబ బంధాలను రాజకీయ వేదికలపై గర్వంగా ప్రదర్శించేవారు.

కాలం తెచ్చిన మార్పులు.. రాజకీయ దూరాలు

కానీ, కాలం మారుతున్న కొద్దీ రాజకీయాల్లో సమీకరణాలు తలకిందులవుతున్నాయి. సొంత రక్త సంబంధాలు, తోబుట్టువులు సైతం రాజకీయ ప్రయోజనాలు, అభిప్రాయభేదాలు, పదవుల పోరు కారణంగా ఎవరి దಾರీ వారు చూసుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు పార్టీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించిన ఈ రాజకీయ అన్నాచెల్లెళ్ల మధ్య ఇప్పుడు కనిపిస్తున్న దూరం తెలుగు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

ఒకనాడు పత్రికా ముఖంగా, బహిరంగ సభల్లో పరస్పరం ప్రశంసలు గుప్పించుకున్న నేతలు.. ఇప్పుడు పండుగ పూట కూడా కలుసుకోలేని పరిస్థితికి రావడానికి రాజకీయ పరిణామాలే కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని అంటారు.. కానీ సొంత రక్త సంబంధాలే ఇలా రాజకీయ తెరవెనుక దూరమవడం కార్యకర్తలను, ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. ఏదేమైనా, నేటి రాజకీయ పరిస్థితుల్లో ఈ 'రాజకీయ తోబుట్టువుల' బంధం కేవలం పాత జ్ఞాపకాలుగా, ఫ్లాష్‌బ్యాక్ కథలుగా మాత్రమే మిగిలిపోవడం విశేషం.