ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవంలో ఎమ్మార్పీఎస్ నాయకుల వ్యాఖ్యలు
యాడికి, ఆగస్టు 7:
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేపట్టిన ఉద్యమ ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం అమల్లోకి వచ్చిందని ఎమ్మార్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, అనంతపురం జిల్లా ఇన్‌చార్జి చిన్న సుబ్బారావు మాదిగ, కో-ఇన్‌చార్జి కోళ్ల కళ్యాణ్ మాదిగ సూచనలతో యాడికి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యాడికి మండలం నూతన ఎమ్మార్పీఎస్ కమిటీ నిర్మాణ ఇన్‌చార్జి ఎంపీ పుల్లయ్య మాదిగ మాట్లాడుతూ, 2004లో నసీమా అనే మైనార్టీ బాలిక గుండె జబ్బుతో బాధపడుతున్న సమయంలో ఆమె చికిత్స కోసం ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారని తెలిపారు. ఆ సందర్భంలో హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులతో కలిసి ఉద్యమం చేపట్టడంతో ప్రభుత్వం స్పందించి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసిందని చెప్పారు.
నేడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది పేద కుటుంబాలు మెరుగైన వైద్య సేవలు పొందుతూ ప్రాణాలు కాపాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. నిరుపేదలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడంలో మందకృష్ణ మాదిగ పోరాటం చారిత్రాత్మకమైందని అన్నారు.
ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు, సీపీఐ నాయకులు, జూటూరు బ్రదర్స్ రఫీ, రజాక్ మాట్లాడుతూ, గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారుల కోసం మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమం మరువలేనిదని, ఆరోగ్యశ్రీ పథకం ఆ పోరాటానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పాతకుట్ల బాలు మాదిగ, మండల అధికార ప్రతినిధి చిటికల చిరంజీవి మాదిగ, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసులు, సీనియర్ నాయకులు నరసింహులు, సూర్యుడు, గాంధీ, శ్రీరాములు, రామాంజనేయులు, చిన్న రాముడు, సుబ్బరాయుడు, నాగార్జున, వెంకట రమణయ్య, టైలర్ పుల్లయ్య, టైలర్ బద్రి తదితరులు పాల్గొన్నారు.

