పిడిఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. వీరేంద్ర ప్రసాద్ డిమాండ్
అనంతపురం, ఆగస్టు 8: సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థి సంఘాలు, మీడియా ప్రతినిధులు ప్రవేశించరాదంటూ ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్‌ను తక్షణమే రద్దు చేయాలని పిడిఎస్‌యూ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. వీరేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద పిడిఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సర్కులర్ ప్రతులను దహనం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో విద్యార్థి సంఘాలు, మీడియా ప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
విద్యార్థి సంఘాలు, మీడియా ప్రతినిధుల ప్రవేశాన్ని అడ్డుకోవడం ద్వారా సమస్యలను ప్రశ్నించే గొంతుకలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు.
జిల్లాలోని పలు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సరైన భోజనం, బాత్రూములు, కిటికీలు, ఫ్యాన్లు తదితర కనీస సదుపాయాలు అందుబాటులో లేవని ఆరోపించారు. హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తక్షణమే సర్కులర్‌ను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వీరేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం సిద్దు, జిల్లా కార్యదర్శి బ్రహ్మ, జిల్లా అధ్యక్షుడు నందు, రాజు తదితరులు పాల్గొన్నారు.
