ఆమిద్యాలలో తుప్పుపడుతున్న కోట్ల విలువైన పరికరాలు

 ఆమిద్యాలలో తుప్పుపడుతున్న కోట్ల విలువైన పరికరాలు

ఉరవకొండ, :ఆగస్టు 6:



కరువు పీడిత అనంతపురం జిల్లాలో రైతులకు వరంగా మారాల్సిన సామూహిక బిందు సేద్య పథకాలు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నిరుపయోగంగా మారాయి. కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


గురువారం ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామ శివారులో నిల్వ ఉంచిన బిందు సేద్య పరికరాలను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.


హంద్రీ-నీవా, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుల పరిధిలో కాలువల ద్వారా నీరు అందని ఎత్తైన ప్రాంతాలకు పైపులైన్ల ద్వారా సాగునీరు అందించేందుకు 2017లో రూ.899.20 కోట్ల వ్యయంతో నాలుగు సామూహిక బిందు సేద్య పథకాలకు శ్రీకారం చుట్టారని జగదీష్ గుర్తు చేశారు. ఉరవకొండ, కూడేరు, బెలుగుప్ప మండలాల్లోని 23 గ్రామాల పరిధిలో 49,918 ఎకరాలకు సాగునీరు అందించడం ఈ పథకాల లక్ష్యం అన్నారు.


పనులు 25 శాతం పూర్తయిన దశలో 2019లో ప్రభుత్వం మారిన తర్వాత పనులను పూర్తిగా నిలిపివేశారని ఆరోపించారు. కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పైపులు, పంపులు, ఇతర పరికరాలు ఆమిద్యాల వద్ద ఎండా వానలకు గురై తుప్పు పట్టి పనికిరాకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో చేపట్టిన నిర్మాణాలు కూడా శిథిలావస్థకు చేరుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.


ఎల్ నినో ప్రభావంతో జిల్లా మళ్లీ తీవ్ర కరువును ఎదుర్కొంటున్న తరుణంలో, రైతులకు శాశ్వత సాగునీటి భరోసా ఇచ్చే పథకాలను పక్కన పెట్టడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వాలు మారినా ప్రజా ప్రయోజనాల పనులు కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.


వెంటనే రూ.899 కోట్ల పథకాలను పునఃప్రారంభించి, పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతాంగాన్ని కలుపుకొని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, జె.మల్లికార్జున, ఉరవకొండ నియోజకవర్గ కార్యదర్శి చెన్నారాయుడు, సహాయ కార్యదర్శి సుల్తాన్, నాగేంద్ర, బసవరాజు, పార్టీ నాయకులు సూరి, అసేన్ భాష తదితరులు పాల్గొన్నారు.