చెన్నై:తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చెన్నై సమీపంలోని పుళల్ (Puzhal) సెంట్రల్ జైలులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి హోదాలో జైలుకు వెళ్లిన ఆయన అక్కడి పరిస్థితులను, ఖైదీల వసతులను స్వయంగా పరిశీలించారు.
ఖైదీల్లో పరివర్తన కోసం..
జైలులో ఖైదీలకు అందుతున్న వైద్య సేవలు, విద్యావకాశాలు మరియు వృత్తి విద్యా శిక్షణ కేంద్రాలను సీఎం విజయ్ పరిశీలించారు. జైలు ఆసుపత్రితో పాటు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌ను తనిఖీ చేసిన ఆయన.. ఖైదీల్లో పరివర్తన తెచ్చి, సత్ప్రవర్తన వైపు దారితీసేలా మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.
సాధారణ కుర్చీలోనే సీఎం..
ఈ తనిఖీల సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ అధికారి తన కుర్చీలో కూర్చోమని ముఖ్యమంత్రిని కోరగా, విజయ్ దానికి అంగీకరించలేదు. అధికారి కుర్చీలో అతన్నే కూర్చోమని చెప్పి, తాను మాత్రం ఒక సాధారణ విజిటర్ చైర్‌లో కూర్చుని అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆయన చూపించిన ఈ సింప్లిసిటీ అక్కడి వారిని ఆకట్టుకుంది.
రియల్ లైఫ్‌లోనూ 'మాస్టర్':ఈ తనిఖీలకు సంబంధించిన దృశ్యాలు చూసిన నెటిజన్లు, అభిమానులు.. బ్లాక్ బస్టర్ హిట్ 'మాస్టర్' (Master) సినిమాను గుర్తుచేసుకుంటున్నారు. ఆ సినిమాలో బాల నేరస్తులను సంస్కరించే జేడీ (JD) మాస్టర్ పాత్రలో అద్భుతంగా నటించిన విజయ్, ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ ముఖ్యమంత్రిగా అదే తరహాలో జైలులో సంస్కరణల కోసం అడుగులు వేయడం విశేషం.
