ఎస్సార్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 65 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు
అనంతపురం, సెప్టెంబర్ 4: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ప్రపంచంలో ఉపాధ్యాయ వృత్తిని మించిన గొప్ప వృత్తి మరొకటి లేదని అనంతపురం ఎంపీ అంబికా జి. లక్ష్మీనారాయణ అన్నారు.
ఎస్సార్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మేరా యువ భారత్, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్‌లో గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం నిర్వహించారు.
కార్యక్రమానికి ఎంపీ అంబికా జి. లక్ష్మీనారాయణ, విశ్రాంత ప్రిన్సిపాల్ డా. పతిక రమేష్ నారాయణ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. పద్మశ్రీ, మై భారత్ ప్రతినిధి బిసాటి భరత్, ఎస్సార్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు సుంకర రమేష్, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డా. గీతా బాల తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా, జీవితంలో సరైన మార్గాన్ని చూపే మార్గదర్శకులుగా నిలుస్తారని అన్నారు. సమాజానికి మంచి పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు.
అనంతరం ‘ఏక్ పేడ్ మా కే నామ్’ అంబాసిడర్ సుంకర నవనీ ఏర్పాటు చేసిన స్టాల్‌ను, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త వర్గ నిర్ధారణ స్టాల్‌ను అతిథులు పరిశీలించారు.
తదుపరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న 65 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఛైర్మన్ డా. గజ్జల లక్ష్మణ ప్రసాద్, ఎస్సార్ ఎడ్యుకేషనల్ సొసైటీ సహ వ్యవస్థాపకులు పి. దీపు కిరణ్ రెడ్డి, సభ్యులు ధోని, శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, రాయలసీమ ప్రజా సమాఖ్య అధ్యక్షులు గొర్తి వెంకట స్వామి, అధ్యాపకులు, విద్యార్థులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
