ఉత్తరాధికారుల మధ్య ఆధిపత్య పోరు

 శ్రీ గవిమఠం ఉత్తరాధికారి వివాదం: కళ్యాణి స్వామిపై చట్టపరమైన చర్యలకు భక్తులు, లింగాయత సంఘాల డిమాండ్

ఉరవకొండ సెప్టెంబర్ 12:చారిత్రక ప్రాశస్త్యం కలిగిన శ్రీ గవిమఠం అధికారిక ఉత్తరాధికారి వ్యవహారంలో కొందరు వ్యక్తులు అక్రమంగా జోక్యం చేసుకుంటూ మఠ పరిపాలనను, ఆధ్యాత్మిక వాతావరణాన్ని భంగపరుస్తున్నారని శ్రీ గవిమఠం సంస్థాన భక్తులు, వీరశైవ జంగమ లింగాయత సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మఠంతో ఎలాంటి చట్టబద్ధమైన లేదా ఆధ్యాత్మిక సంబంధం లేని సిద్ధయ్య (అలియాస్ కళ్యాణి స్వామి) పై దేవాదాయ శాఖ, పోలీస్ యంత్రాంగం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కోర్టు ఆదేశాలు & దేవాదాయ శాఖ స్పష్టత:

అధికారిక నియామకం: 1975 అక్టోబర్ 03న అప్పటి పీఠాధిపతులు శ్రీ చన్నబసవ రాజేంద్ర స్వామి వారు డాక్టర్ శ్రీ కరిబసవ రాజేంద్ర స్వామి (ప్రత్యక్ష చికేమఠ్) గారిని శ్రీ గనిమఠం ఉత్తరాధికారిగా నామినేట్ చేశారు. సదరు నియామకాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ 2006 జనవరి 04న (R.C. No: D2/52507/05) అధికారికంగా ధృవీకరించారు.
 అనర్హత తిరస్కరణ: కళ్యాణి స్వామి పీఠాధిపతిపై ఒత్తిడి తెచ్చి నామినేషన్ పత్రాలు సృష్టించినప్పటికీ, దేవాదాయ ధార్మిక పరిషత్ మరియు అనంతపురం అడిషనల్ కోర్టు ఆదేశాల మేరకు కమిషనర్ ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు. 
డాక్టర్ శ్రీ కరిబసవ రాజేంద్ర స్వామి వారే మఠం చట్టబద్ధ ఉత్తరాధికారిగా కొనసాగుతారని 2017 ఏప్రిల్ 17న (Memo No: M3/2338/2014) స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.
 కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్: కరిబసవ స్వామి వారిని తొలగించే అధికారం పీఠాధిపతికి లేదని స్పష్టం చేస్తూ, 2019 ఫిబ్రవరి 05న జిల్లా సీనియర్ డివిజన్ కోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. కరిబసవ స్వామి విధుల నిర్వహణకు పీఠాధిపతులుగానీ, ఇతరులుగానీ ఎలాంటి ఆటంకం కలిగించరాదని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

భక్తుల డిమాండ్లు & హెచ్చరిక:

న్యాయస్థానాలు మరియు దేవాదాయ శాఖ ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నప్పటికీ, కళ్యాణి స్వామి మఠం ఆస్తులు, విశ్రాంతి భవనాలు మరియు పరిపాలనా వ్యవహారాల్లో అక్రమంగా జోక్యం చేసుకుంటూ వివాదాలు సృష్టిస్తున్నారని భక్తులు ఆరోపించారు. మఠం ప్రతిష్టను దిగజారుస్తూ, భక్తుల ఆధ్యాత్మిక మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు.

ఈ వివాదం మరింత ముదిరి శాంతిభద్రతల సమస్యగా మారకముందే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, పోలీసులు స్పందించి కళ్యాణి స్వామిపై చట్టపరమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని శ్రీ గవిమఠం సంస్థాన భక్తులు, వీరశైవ జంగమ లింగాయత సంఘాల నాయకులు విజ్ఞప్తిచేశారు.