శీర్షిక లేదు

 జిల్లా కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి వినతి

ఎండిపోతున్న పండ్ల తోటలు.. తీవ్ర తాగునీటి ఎద్దడిపై ఆందోళన

అనంతపురం, సెప్టెంబర్ 08: ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని కూడేరు మండలంలో కరువు పరిస్థితులు తీవ్రంగా మారాయని, ఎండిపోతున్న పండ్ల తోటలు, తాగునీటి సమస్య నుంచి రైతులు, ప్రజలను కాపాడేందుకు చెరువులను హంద్రీ-నీవా నీటితో తక్షణమే నింపాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.

అనంతపురం జిల్లాలో సాధారణంగా తక్కువ వర్షపాతం నమోదవుతుందని, కూడేరు మండలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు గణనీయంగా తగ్గాయని, సెప్టెంబర్ నెల వచ్చినా వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న కూడేరు మండలంలో హంద్రీ-నీవా రెండో దశ కాల్వకు లైనింగ్ చేయడం వల్ల భూగర్భ జలాల లభ్యత తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు. వర్షాలు లేక మెట్ట పంటలు ఎండిపోతుండగా, బోర్లు అడుగంటడంతో పండ్ల తోటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
పండ్ల తోటలకు నీటిని అందించేందుకు ఒక్కో వాటర్ ట్యాంకర్‌కు సుమారు రూ.600 ఖర్చు చేయాల్సి వస్తోందని, పంట చేతికొచ్చే వరకు ఈ భారాన్ని భరించడం రైతులకు కష్టంగా మారిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, పశువులకు కూడా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు దిగువకు వెళ్తున్నప్పటికీ ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని కరువు పరిస్థితులపై తగిన దృష్టి సారించడం లేదని విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. హెచ్‌ఎల్‌సీ ఎగువ భాగంలోని కర్ణాటక ప్రాంతానికి పంటల కోసం నీరు అందుతున్నప్పటికీ, అనంతపురం జిల్లాలో కనీసం చెరువులు నింపేందుకు కూడా నీరు ఇవ్వకపోవడం దారుణమన్నారు.
ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరు అందిస్తున్న నేపథ్యంలో తుంగభద్ర నది నుంచి కేసీ కెనాల్‌కు కేటాయించే నీటిలో కనీసం 5 టీఎంసీలను అనంతపురం జిల్లాకు మళ్లించే అవకాశం ఉందని విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు.
తుంగభద్రలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని అదనపు నీటిని జిల్లాకు కేటాయించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. కూడేరు మండలంలోని చెరువులను హంద్రీ-నీవా నీటితో నింపడంతో పాటు పండ్ల తోటలను కాపాడేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ప్రత్యామ్నాయ నీటి వనరులను వినియోగించి రైతులను ఆదుకోవాలని, ప్రస్తుత కరువు పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా అత్యవసర చర్యలు చేపట్టాలని కోరారు.