విజయవాడ (సెప్టెంబర్ 8): విజయవాడలోని చాంబర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ ఛైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్, కమిషన్ మెంబర్ మేకల బిక్షంలను బాధితుడు వై కుళ్లాయప్పతో కలిసి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కలిశారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, అనుచిత ప్రవర్తనపై వారికి వినతిపత్రం సమర్పించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రావి వెంకటంపల్లి గ్రామానికి చెందిన వై కుళ్లాయప్పకు 1976లో పెద్ద పోడమల గ్రామ పొలంలోని సర్వే నెంబర్ 1303లో 2 ఎకరాల 33 సెంట్లు భూమిని సీలింగ్ ల్యాండ్ కింద ప్రభుత్వం సాగు పట్టా మంజూరు చేసింది. అయితే, ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన లక్కం ఓబులమ్మ తన కూతురైన నార్పల మండలం గడ్డనాగేపల్లికి చెందిన బుసగాని లక్ష్మి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి, ఆ భూమిని రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించుకుంది.
ఆరేళ్లుగా పోరాటం – పట్టించుకోని అధికారులు:
ఈ అన్యాయంపై గత ఆరు సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ నాయకుడు పి. రాజారత్నం మాదిగ బాధితుడు వై కుళ్లాయప్ప పక్షాన అన్ని ఆధారాలను సేకరించారు. ఎమ్మార్వో మొదలుకొని కలెక్టర్ వరకు సంబంధిత అధికారులందరికీ ఆధారాలతో సహా రికార్డులను సమర్పించినప్పటికీ, కుళ్లాయప్ప పేరు మీద తిరిగి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. బాధితుడికి న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ ఛైర్మన్‌ను కోరారు.
రెవెన్యూ డివిజనల్ అధికారి అనుచిత ప్రవర్తనపై ఫిర్యాదు:
ఇదే అంశంపై తాడిపత్రి ఎమ్మార్వో ఆఫీస్‌లో అనంతపురం రెవెన్యూ డివిజనల్ అధికారిని పి. రాజారత్నం మాదిగ ప్రశ్నించగా, బాధ్యతాయుతమైన పబ్లిక్ ఆఫీసర్ అయి ఉండి తీవ్రమైన అసభ్య పదజాలంతో మాట్లాడుతూ బహిరంగంగా అవమానపరిచారని తెలిపారు. ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, బహురంగంగా అవమానించిన ఆ అధికారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు విన్నవించారు.
