ఉరవకొండలో గణేష్ నిమజ్జనం, పందిళ్ల ఏర్పాటుపై సీఐమహా నంది దిశానిర్దేశం

ఉరవకొండలో వినాయక ఉత్సవ నిర్వాహకులతో పోలీసుల ప్రత్యేక సమావేశం

ఉరవకొండ: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఉరవకొండ పట్టణంలో గణేష్ ఉత్సవ నిర్వాహకులతో పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక మండపాల ఏర్పాటు, నిమజ్జనం ఊరేగింపులు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతలకు సంబంధించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.వినాయక విగ్రహాల నిమజ్జనం సమయం, ఊరేగింపు మార్గాలు, మండపాల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

అలాగే వినాయక మండపాల ఏర్పాటు కారణంగా సాధారణ ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
నిమజ్జనం రోజున పోలీసు శాఖ సూచించే నిబంధనలు, మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో ఉరవకొండ పట్టణంలోని పలు వినాయక మండపాల నిర్వాహకులు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.