True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఒక్కసారి వాడే వైద్య పరికరాల పునర్వినియోగంపై కేంద్రం ఆదేశాలు

 

ఒక్కసారి వాడే వైద్య పరికరాలను మళ్లీ వినియోగించొద్దు!

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు కేంద్రం ఆదేశాలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

న్యూఢిల్లీ: ఆస్పత్రుల్లో రోగుల చికిత్సకు ఒక్కసారి మాత్రమే వినియోగించాల్సిన వైద్య పరికరాలను తిరిగి ఉపయోగించడంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సింగిల్‌ యూజ్‌ వైద్య పరికరాలు, డిస్పోజబుల్‌ సర్జికల్‌ వస్తువులను స్టెరిలైజేషన్‌ పేరుతో శుభ్రం చేసి మళ్లీ వినియోగిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు సహా అన్ని వైద్య సంస్థలు నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలోని ఆరోగ్య సేవల డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీహెచ్‌ఎస్‌) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసినట్లు వెల్లడైంది.

కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ, కార్డియోథొరాసిక్‌ అండ్‌ వాస్క్యులర్‌ సర్జరీ, న్యూరోసర్జరీ వంటి కీలక వైద్య విభాగాల్లో ఒకసారి ఉపయోగించిన పరికరాలను స్టెరిలైజేషన్‌ చేసి తిరిగి వినియోగిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. కొన్ని సందర్భాల్లో ఆయా పరికరాల పూర్తి ఖర్చును రోగుల నుంచి వసూలు చేయడంతో పాటు, ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద రీయింబర్స్‌మెంట్‌ కూడా పొందుతున్నట్లు లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

ఒక్కసారి మాత్రమే ఉపయోగించాల్సిన వైద్య పరికరాలను తిరిగి వినియోగించడం వల్ల రోగుల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఒక రోగి నుంచి మరొకరికి అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని పేర్కొంది. రోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వైద్య సంస్థలు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది.

ఈ వ్యవహారంపై రాష్ట్రాల ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు, ఆరోగ్య సేవల సంచాలకులు, డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ), రాష్ట్రాల డ్రగ్‌ కంట్రోలర్లు పర్యవేక్షణ చేపట్టాలని కేంద్రం సూచించింది. ఆస్పత్రుల్లో అవసరమైన తనిఖీలు నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.

రోగుల చికిత్సలో ఉపయోగించే వైద్య పరికరాల భద్రత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

↑