అనంతపురం: అనంతపురం రూరల్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ తొలి రోజు ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని 24 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించారు.
ఆకుతోటపల్లి-2, అనంతపురం రూరల్, కక్కలపల్లి, రుద్రంపేట, రాజీవ్ కాలనీ, కురుగుంట, కక్కలపల్లి కాలనీ తదితర ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది.
తొలి రోజు మండలంలోని వివిధ గ్రామాల నుంచి మొత్తం 117 నామినేషన్లు అందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి. దివాకర్ తెలిపారు. ఇందులో సర్పంచ్ స్థానాలకు 54 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 63 నామినేషన్లు స్వీకరించినట్లు వెల్లడించారు.
నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆయా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

