విజేతలకు బహుమతుల ప్రదానం.. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎంఈఓ-2 రమాదేవి*
ఉరవకొండ (ట్రూ టైమ్స్ ఇండియా):ఉరవకొండ శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర గ్రంథాలయ శాఖ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజులపాటు ఈ వారోత్సవాలను నిర్వహించారు.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ-2 రమాదేవి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సెంట్రల్ హెచ్‌ఎం ఖాదర్ బాషా, ఉపాధ్యాయులు సంజీవరెడ్డి, మంజుల హాజరయ్యారు. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల సన్నద్ధతతో పాటు విలువైన సమాచారాన్ని అందించడంలో గ్రంథాలయాలు ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాల సేవలను వినియోగించుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
వారం రోజులపాటు నిర్వహించిన వారోత్సవాల్లో విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించే పలు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అతిథులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి వై. ప్రతాపరెడ్డి, జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు, ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమ విజయానికి సహకరించిన అధికారులు, పాత్రికేయులు, మీడియా ప్రతినిధులకు గ్రంథాలయాధికారి ప్రతాపరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


