నూతన జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్కు మంత్రి పయ్యావుల కేశవ్ అభినందనలు
అనంతపురం (ట్రూ టైమ్స్ ఇండియా): జిల్లా పరిషత్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు జడ్పీటీసీ సభ్యులు నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు.
అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి ఓ.ఆనంద్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులతో జిల్లా కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన విధివిధానాలను జడ్పీ సీఈఓ వివరించారు.
జడ్పీ చైర్మన్ పదవికి గార్లదిన్నె జడ్పీటీసీ సభ్యుడు గంజి నాగరాజు పేరును యాడికి మండల జడ్పీటీసీ ప్రతిపాదించగా, ఏకైక అభ్యర్థిగా ఉండటంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
అదేవిధంగా వైస్ చైర్మన్ పదవికి వెన్నపూస లలిత పేరును బ్రహ్మసముద్రం మండల జడ్పీటీసీ పాలకొండ శ్రీరాములు ప్రతిపాదించగా, యల్లనూరు మండల జడ్పీటీసీ బలపరిచారు. రెండో అభ్యర్థి లేకపోవడంతో వెన్నపూస లలితను వైస్ చైర్మన్గా ప్రకటించారు.
అనంతరం నూతన చైర్మన్ గంజి నాగరాజు, వైస్ చైర్మన్ వెన్నపూస లలిత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం జడ్పీటీసీ సభ్యుల వద్దకు వెళ్లి వారిని వ్యక్తిగతంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

