చేనేతలు, కార్మికులు, చిరు వ్యాపారుల మద్దతుతో ఎన్నికల బరిలోకి!
ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా
ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సైదం వెంకటేశులు అలియాస్ ఫోటోస్టాట్ వెంకటేశులు బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. తొలుత తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఆశించినప్పటికీ, పార్టీ అధిష్టానం నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.
టీడీపీ కార్యకర్త స్థాయి నుంచి చేనేత నాయకుడిగా ఎదుగుదల
ఆది నుంచి తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కొనసాగుతూ, చేనేత రంగంలో నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్టీ నుంచి ఎలాంటి పదవులు ఆశించకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఫోటోస్టాట్ వెంకటేశులుగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా చేనేత కార్మికులు, మెకానిక్‌లు, భవన నిర్మాణ కార్మికులు, పూలు, పండ్ల వ్యాపారులు, చిరు వ్యాపారులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ వర్గాల నుంచి తనకు మద్దతు లభిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పేదల పక్షాన పోరాడిన వ్యక్తిగా గుర్తింపు
పట్టణంలో రోడ్ల విస్తరణ సందర్భంగా ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే పేదలు ఉపాధి కోల్పోయిన సమయంలో వారి పక్షాన నిలిచి పోరాటం చేసినట్లు వెంకటేశులు పేర్కొన్నారు. పేదలు, చిరు వ్యాపారుల జీవనోపాధికి అండగా నిలవడమే తన రాజకీయ లక్ష్యమని తెలిపారు.
సంపన్నులకే సర్పంచ్ పదవులా? కార్యకర్తల్లో అసంతృప్తి!
ఏళ్ల తరబడి పార్టీ జెండాను భుజాన మోస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేసిన కార్యకర్తలకు కాకుండా సంపన్నులకే సర్పంచ్ అభ్యర్థిత్వం కేటాయిస్తున్నారనే అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ కోసం పనిచేసిన ఆశావహులకు అవకాశం దక్కకపోవడంతో నిరాశకు గురైనట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
గతంలో ముగ్గురు సంతానం నిబంధన కారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోయిందని, ప్రస్తుతం ప్రభుత్వం నిబంధనలను సడలించడంతో పోటీకి సిద్ధమైనట్లు వివరించారు. నామినేషన్ దాఖలుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిపారు.
మునుపటి సర్పంచుల కంటే మెరుగైన సేవలు అందిస్తా
ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే గత సర్పంచుల కంటే మెరుగైన సేవలు అందిస్తానని సైదం వెంకటేశులు హామీ ఇచ్చారు. ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీలో గత 25 ఏళ్లుగా కూరగాయల మార్కెట్ ఏర్పాటు జరగలేదని, తాను ఎన్నికైతే ప్రాధాన్యతా క్రమంలో కూరగాయల మార్కెట్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.
అలాగే ప్రజలు సేదతీరేందుకు పార్కు ఏర్పాటు, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. పట్టణంలో శిథిలావస్థకు చేరిన రహదారులకు పునరుద్ధరణ చేపట్టి, ఉరవకొండను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని పేర్కొన్నారు.
చేనేతలు, మైనార్టీలు, కార్మికులు, చిరు వ్యాపారులు సహా అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతు తెలిపి ఆశీర్వదించాలని స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి సైదం వెంకటేశులు అలియాస్ ఫోటోస్టాట్ వెంకటేశులు విజ్ఞప్తి చేశారు.

