తొర్రూరు, నవంబర్ 13 (ట్రూ టైమ్స్ ఇండియా): తొర్రూరు పట్టణంలోని ఓ నివాస గృహంలో అగ్నిప్రమాదం సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి, సాహసోపేతంగా మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.
పట్టణంలోని ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో ఇంటి పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో తొర్రూరు ఎస్ఐ మహేందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇంట్లో మంటలు, దట్టమైన పొగ అలుముకున్నప్పటికీ ఏమాత్రం వెనుకాడకుండా ఎస్ఐ మహేందర్ రెడ్డి, ఖాదర్ బాషా తదితర పోలీసు సిబ్బంది ఇంట్లోకి ప్రవేశించారు. స్థానికుల సహకారంతో నీటిని చల్లుతూ మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. పోలీసుల సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలతో మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకోగలిగారు.
ప్రమాద తీవ్రతను గుర్తించి పోలీసులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నివారించడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారు.
ఆపద సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాధ్యతతో వ్యవహరించి సహాయం అందించిన ఎస్ఐ మహేందర్ రెడ్డి, ఖాదర్ బాషా, ఇతర పోలీసు సిబ్బందిని స్థానికులు అభినందించారు. ప్రజల భద్రత కోసం పోలీసులు చూపిన చొరవ పట్ల హర్షం వ్యక్తం చేశారు.

