చెళ్లగుర్కిలోని 22.40 ఎకరాల భూమిపై ప్రత్యేక దృష్టి
అక్రమ సాగు, అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకుంటాం
ఎండోమెంట్ ఏసీ, గవిమఠం మేనేజర్ బోయపాటి సుధారాణి వెల్లడి
ఉరవకొండ (ట్రూ టైమ్స్ ఇండియా), నవంబర్ 17: ఉరవకొండ గవిమఠ సంస్థానానికి చెందిన చెళ్లగుర్కి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 111B, 114B లో ఉన్న 22.40 ఎకరాల భూమిని వేలం వేయడానికి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ (ఏసీ) మరియు గవిమఠం మేనేజర్ శ్రీమతి బోయపాటి సుధారాణి మంగళవారం వెల్లడించారు.
గతంలో ఆగిన వేలం.. అక్రమ సాగుపై ఆరోపణలు:
ఈ వివాదాస్పద భూమిని వేలం వేసేందుకు గతంలో 05.07.2026 తేదీన అప్పటి ఏసీ, మఠం మేనేజర్ గంజి మల్లికార్జునప్రసాద్ చర్యలు చేపట్టినప్పటికీ, చివరి క్షణంలో వేలం నిలిచిపోయింది. అనంతరం దేవాదాయ శాఖ అధికారులు ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే, ఆ హెచ్చరికలను బేఖాతారు చేస్తూ గుంతకల్ గ్రూప్ టెంపుల్ అధికారి మఠం మల్లికార్జున మరియు ఆయన కుటుంబ సభ్యులు సదరు భూమిలో అక్రమంగా పంటలు సాగు చేశారు. దేవదాయ చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, ఆయనే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటం 'కంచె చేను మేసిన' చందంగా మారిందని స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఫిర్యాదులపై స్పందించిన నూతన ఏసీ:
ఇటీవల జిల్లా ఏసీగా మరియు మఠం మేనేజర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బోయపాటి సుధారాణి ఈ వ్యవహారంపై స్పందించారు. కర్ణాటకలోని గవిమఠం భూముల్లో సాగుతున్న రూ. 60 లక్షల అక్రమ మట్టి మాఫియా, వాణిజ్య సముదాయాల (కాంప్లెక్స్) అద్దెలు, ఏనుగు ఆదాయం, ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు ఆభరణాల వ్యవహారాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతూ మధుబాబు ఇచ్చిన ఫిర్యాదుపై ఆమె సానుకూలంగా స్పందించారు.
అవినీతిని ఉపేక్షించేది లేదు:
"ప్రాధాన్యత క్రమంలో ముందుగా చెళ్లగుర్కి భూవివాదాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తాం. ఆ భూమిని వేలానికి సిద్ధం చేసిన అనంతరం, మిగిలిన ఆరోపణలు మరియు ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తాం" అని సుధారాణి స్పష్టం చేశారు. మఠం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని, పెండింగ్‌లో ఉన్న లీజులు, అద్దెల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించామని ఆమె పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మఠం ఆస్తుల విషయంలో అక్రమాలు, అవినీతిని ఉపేక్షించేది లేదని ఆమె తేల్చి చెప్పారు.

