True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

గుమ్మగట్ట కేజీబీవీలో 105 మంది విద్యార్థినులకు అస్వస్థత.. విచారణకు ఏఐవైఎఫ్ డిమాండ్

 

గుమ్మగట్ట కేజీబీవీలో కలకలం.. 105 మంది విద్యార్థినులకు అస్వస్థత

ఆహార నాణ్యత లోపాలే కారణమంటూ ఏఐవైఎఫ్ ఆరోపణ.. బాధ్యులైన సిబ్బందిని సస్పెండ్ చేయాలని కావలి కోట్రేష్ డిమాండ్

రాయదుర్గం, ట్రూ టైమ్స్ ఇండియా: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన ఆందోళనకు దారితీసింది. పాఠశాలలో ఆహార నాణ్యత లోపాల కారణంగా సుమారు 105 మంది విద్యార్థినులు కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆరోపించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కావలి కోట్రేష్ డిమాండ్ చేశారు.

అస్వస్థతకు గురై గుమ్మగట్ట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను కావలి కోట్రేష్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు విద్యార్థినులతో నేరుగా మాట్లాడి పాఠశాలలో అందిస్తున్న భోజనం, రోజువారీ మెనూ, ఆహార నాణ్యత, ఇతర సమస్యలపై వివరాలు సేకరించారు.

అనంతరం వైద్య, విద్యాశాఖ అధికారులతో కలిసి పాఠశాలలోని వంటగది, కూరగాయలు, గుడ్లు, పాలు, వంట సామగ్రి నిల్వ గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాడైపోయిన కూరగాయలు కనిపించాయని, ఆహార పదార్థాల నిల్వ, నాణ్యత విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని కోట్రేష్ పేర్కొన్నారు.

విద్యార్థినులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంపై ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ ఘటనకు గల కారణాలను నిష్పక్షపాతంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

గతంలో బొమ్మనహాల్ కేజీబీవీలోనూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చినప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం విచారకరమని విమర్శించారు. విద్యార్థినుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు జీసీడీఓ, ఏపీసీ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన రాలేదని ఆరోపించారు.

ఏఐవైఎఫ్ ప్రధాన డిమాండ్లు ఇవే..

  1. గుమ్మగట్ట కేజీబీవీలో జరిగిన ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలి.
  2. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు తేలిన బాధ్యులైన సిబ్బందిపై సస్పెన్షన్ సహా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.
  3. విద్యార్థినులకు అందించిన ఆహారం, తాగునీటి నమూనాలను పరీక్షించి నాణ్యతను నిర్ధారించాలి.
  4. అస్వస్థతకు గురైన విద్యార్థినులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించి, పూర్తిగా కోలుకునే వరకు వైద్య పర్యవేక్షణ కొనసాగించాలి.
  5. జిల్లాలోని అన్ని కేజీబీవీల్లో ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి.

విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యతని కావలి కోట్రేష్ పేర్కొన్నారు. విద్యార్థినుల ఆరోగ్యానికి భంగం కలిగించే నిర్లక్ష్యాన్ని సహించబోమని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.


↑