బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సూచన.. గత ఆదేశాల అమలులో జాప్యంపై అసంతృప్తి
గుంతకల్లు (ట్రూ టైమ్స్ ఇండియా): ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ రికార్డులు కనిపించకుండా పోయిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుంతకల్లు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) ఎ.వి.వి.ఎస్.వి. శ్రీనివాస్ ఆదేశించారు. రికార్డులు మాయమైన ఘటనపై గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరుగుతుండటంపై ఆయన మరోసారి స్పందించారు.
ఉరవకొండ పట్టణానికి చెందిన మీనుగ మదుబాబు 2026 ఆగస్టు 17న సమర్పించిన వినతిపత్రం ఆధారంగా ఆర్డీఓ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. సమాచార హక్కు చట్టం-2005 సెక్షన్ 6(1) కింద 21 అంశాలకు సంబంధించిన సమాచారం కోరగా, పూర్తి వివరాలు అందకపోవడంతో పాటు సంబంధిత రికార్డులు ప్రస్తుతం అందుబాటులో లేవని అధికారులు తెలిపినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఫైళ్లు కనిపించకుండా పోవడానికి గల కారణాలను గుర్తించి, బాధ్యులైన అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని 2026 ఏప్రిల్ 15న లిఖితపూర్వకంగా ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు పోలీసు కేసు నమోదు కాకపోవడాన్ని ఆర్డీఓ ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ రికార్డ్స్ చట్టం తదితర చట్టపరమైన నిబంధనల ప్రకారం సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యత నిర్ధారణ అయిన వారిపై సంబంధిత సెక్షన్ల కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఎఫ్‌ఐఆర్ నమోదుకు చర్యలు చేపట్టాలని ఉరవకొండ తహశీల్దార్‌కు సూచించారు.
ఈ మేరకు 2026 నవంబర్ 23న ఆర్.సి. నెం. D/1743/2026తో ఉత్తర్వులు జారీ చేస్తూ, వాటి ప్రతిని ఫిర్యాదుదారుడు మీనుగ మదుబాబుకు కూడా పంపించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో కీలకమైన రెవెన్యూ రికార్డులు కనిపించకుండా పోవడంపై ఉన్నతాధికారులు స్పందించడంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

