రాజకీయ పార్టీలకతీతంగా సమాజ శ్రేయస్సే జనహిత సంఘం లక్ష్యం
సేవా భావంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: జనహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కురుగుంట మనోహర్
అనంతపురం, ట్రూ టైమ్స్ ఇండియా: రాజకీయ పార్టీలకతీతంగా సమాజ శ్రేయస్సు, ప్రజాసేవే లక్ష్యంగా జనహిత సంఘం (JHS) ముందుకు సాగుతుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కురుగుంట మనోహర్ తెలిపారు. శుక్రవారం అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లో జనహిత సంఘం, దాని అనుబంధ సంఘాలైన జన విద్యార్థి సంఘం (JVS), జన యువజన సంఘం (JYS), జన రైతు సంఘం (JRS) ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కురుగుంట మనోహర్ అధ్యక్షత వహించారు.
ఈ ఆవిర్భావ సభకు వివిధ ప్రజా, కుల, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హాజరై మద్దతు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సంఘం నాయకుడు సాకే హరి, బహుజన యువసేన నాయకుడు వాల్మీకి హరి, గిరిజన ఐక్య సంఘం నాయకుడు కేశవ నాయక్, న్యాయవాది సూర్యచంద్ర, అమర్ యాదవ్, కుళ్లాయి స్వామి, నరేంద్ర, మంత్రి సుదర్శన్, భీమేష్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కురుగుంట మనోహర్ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే జనహిత సంఘం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవారికి అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
విద్య, వైద్యం, ఉపాధి, రాజ్యాంగ హక్కులపై విద్యార్థులు, యువత, రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ ఐక్యపరిచి సమాజ హితం కోసం పనిచేస్తామని చెప్పారు.
పోరాటాలకే పరిమితం కాకుండా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తామని, రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు సహాయం వంటి సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజల హక్కులకు భంగం కలిగినా, సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగినా బాధితుల పక్షాన నిలబడి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతామని స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా జనహిత సంఘం, దాని అనుబంధ సంఘాల కమిటీలను బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువవుతామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లను నియమించి వారికి నియామక పత్రాలను కురుగుంట మనోహర్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

