ఉరవకొండలో రూ.250 కోట్ల భూ కుంభకోణం – 109 పంచాయతీ స్థలాల అక్రమ కేటాయింపు

Malapati
0

అనంతపురం జిల్లా ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గ్రామ ప్రజా అవసరాల కోసం కేటాయించిన పంచాయతీ స్థలాలు, లేఅవుట్ ఓపెన్ స్పేస్‌లు అన్యాక్రాంతం కావడంతో సుమారు రూ. 250 కోట్ల విలువైన ఆస్తులు అక్రమంగా వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సుమారు 1995 నుండి 2021 వరకు కాలంలో పంచాయతీ పరిధిలోని 109 స్థలాలను కేవలం పంచాయతీ తీర్మానాల ఆధారంగా అడ్డగోలుగా కేటాయించినట్లు విచారణలో తేలింది. ప్రభుత్వ ఉత్తర్వులు, పంచాయతీరాజ్ చట్టాలను పూర్తిగా పక్కనపెట్టి ఈ కేటాయింపులు జరిపినట్లు సమాచారం..     నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు

ప్రభుత్వ జీవో నెం.119 (2017) ప్రకారం లేఅవుట్‌లలో 10 శాతం స్థలాన్ని పార్కులు, ఆటస్థలాలకు కేటాయించాల్సి ఉంటుంది. అలాగే జీవో నెం.188 (2011) ప్రకారం పంచాయతీ స్థలాలను లీజుకు ఇవ్వాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే ఉరవకొండలో ఈ నిబంధనలను పట్టించుకోకుండా స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1994లోని సెక్షన్ 53, 58 ప్రకారం పంచాయతీ స్థలాలను అమ్మడం చట్టరీత్యా నిషేధమైనప్పటికీ, దీనిని కూడా ఉల్లంఘించినట్లు తెలిసింది.

అక్రమాల ఆరోపణలు వెల్లువ
పంచాయతీ స్థలాలను కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక ఉపసర్పంచ్ తన పేరిట స్థలం నమోదు చేసుకుని విక్రయించగా, ఆ వ్యవహారం ప్రస్తుతం విచారణలో ఉంది. అలాగే అప్పటి ఈవో గౌస్ సాహెబ్ తన కుటుంబ సభ్యుల పేరిట స్థలం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇతర రాజకీయ సంఘాలు, చేనేత సొసైటీలు, విశ్రాంత ఉద్యోగుల సంఘాలు కూడా పంచాయతీ స్థలాలను వాణిజ్య వినియోగానికి ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది.
లోకాయుక్త జోక్యంతో వెలుగులోకి
సామాజిక కార్యకర్త మీనుగ మధుబాబు ఫిర్యాదు మేరకు లోకాయుక్త జోక్యం చేసుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విచారణలో 109 స్థలాలు ఎటువంటి లీజు ఒప్పందాలు లేదా ప్రభుత్వ అనుమతులు లేకుండా కేటాయించినట్లు అధికారులు గుర్తించారు.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో ఎంపీడీవో రవి ప్రసాద్ మరియు ఇతర అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. పంచాయతీ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్న జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని అక్రమంగా కేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఫిర్యాదుదారులు డిమాండ్ చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!