కౌకుంట్ల పంచాయతీ పరిధిలోని రాశిపల్లి, మైలారం పల్లి గ్రామాల్లో మౌలిక వసతుల సమస్యలు తీవ్రంగా మారాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే అభివృద్ధి పనులు నిలిచిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఏళ్ల తరబడి ఈ గ్రామాల్లో మట్టి రోడ్లే కొనసాగుతున్నాయని, కనీసం గ్రావెల్ వేసి రోలర్‌తో చదును చేసే పనులు కూడా జరగలేదని ప్రజలు చెబుతున్నారు. వర్షాకాలంలో రాకపోకలు పూర్తిగా ఇబ్బందిగా మారుతున్నాయని పేర్కొంటున్నారు.రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామాలకు బస్సు సర్వీసులు సరిగా రాకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ చేరుకోవడంలో కూడా ఆలస్యం జరుగుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీసీ కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, చుక్క నీటి కోసం కూడా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు చెబుతున్నారు. అలాగే విద్యుత్ సరఫరా కూడా అనియమితంగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
సొంత పంచాయతీ పరిధిలోనే ఇలాంటి సమస్యలు కొనసాగడం పట్ల స్థానికంగా చర్చ జరుగుతోంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారులు, తాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మంజూరైన నిధులు గ్రామాలకు వినియోగించలేదా అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితమయ్యాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.“అభివృద్ధి పనులు చేయకపోవడం వల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాం. రాజకీయాలకు అతీతంగా గ్రామాల సమస్యలను పరిష్కరించాలి” అని గ్రామస్థులు కోరుతున్నారు.
