తిరుపతి:ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతున్నాయో లేదో నిర్ధారించడానికి తిరుపతి పట్టణంలోని పలు పెట్రోల్ బంకులపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ పరిధిలోని ఎయిర్ బైపాస్ రోడ్ వద్ద ఉన్న కూరపాటి సర్వీస్ స్టేషన్, తిరుపతి రూరల్ మండలంలోని అవిలాల గ్రామంలో ఉన్న వి.కే.ఆర్.ఆర్ ఫ్యూయల్ స్టేషన్, అలాగే హెచ్పిసిఎల్ ఇంధన స్టేషన్, పాత అలిపిరి రోడ్ వద్ద మహతి ఆడిటోరియం సమీపంలోని రిటైల్ అవుట్‌లెట్లను సందర్శించారు.
బంకుల్లో ఇంధన నాణ్యత, కొలతల ఖచ్చితత్వం, నిర్వహణ విధానాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు.
ఇంధన సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వినియోగదారుల హక్కులను కాపాడడం ప్రతి బంక్ యజమాని బాధ్యత అని స్పష్టం చేశారు. ఫిర్యాదులు వచ్చిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రమాలకు తావు లేకుండా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి రాజు, రూరల్ తహసీల్దార్ సురేష్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.

