అనంతపురం: జిల్లాలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. అనంతపురం నగరంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని విద్యాశాఖ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
సమావేశంలో విద్యాసంస్థల అక్రమ కార్యకలాపాలపై పలు అంశాలను ప్రస్తావించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేపడుతున్నారని, ఈ విధంగా తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని నాయకులు ఆరోపించారు.
అలాగే, పట్టణమంతటా అడ్మిషన్ల పేరుతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ, వాటిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాస్పదంగా ఉందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, “నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలి. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలి. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోకపోతే, ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దశల వారీగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం” అని హెచ్చరించారు.
ఈ సమావేశంలో PSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఆలం, AISP రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ, AIFDS రాష్ట్ర అధ్యక్షుడు సిద్దు, USFI రాష్ట్ర అధ్యక్షుడు పవన్, PSF జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతిభ భారతి తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా, ST, SC, BC మైనార్టీ జేఏసీ నాయకులు వంశీ, PSF జిల్లా సహాయ కార్యదర్శి శ్రవణ్, రాజు, హరి, శివ, విశ్వనాథ్ తదితర విద్యార్థి నాయకులు కూడా హాజరయ్యారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
